అలా జరిగితే మాత్రమే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారట.. కానీ?

Chandrababu

2024 సంవత్సరంలో ఏపీకి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారు. అయితే చంద్రబాబు కలలు నిజం కావడానికి ఏ స్థాయిలో అవకాశం ఉందో నిజం కాకపోవడానికి కూడా అదే స్థాయిలో అవకాశం ఉంది. టీడీపీ భవిష్యత్తు పొత్తులపై మాత్రమే చంద్రబాబు భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేస్తే మాత్రమే అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా లేదు. ఏపీలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని బీజేపీ భావిస్తోంది. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేని పరిస్థితి జనసేనకు ఉంది. బీజేపీ మాట కాదని జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు ఇబ్బందులు తప్పవు.

2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా జగన్ ఈ మూడు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే 2014 సంవత్సరంలో వైసీపీ ఓడిపోయింది. ఒకవేళ టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు లేకుండా పోటీ చేసి ఉంటే మాత్రం 2014లోనే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని చెప్పవచ్చు. చంద్రబాబు ఏదో ఒక విధంగా బీజేపీ, జనసేనలను ఒప్పిస్తే మాత్రమే టీడీపీకి భవిష్యత్తు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఏపీలోని కొంతమంది ప్రజలు మాత్రం చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందని వాళ్లు, టీడీపీ వల్ల గతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనాలు పొందిన వాళ్లు, వైసీపీ కార్యకర్తల ఎమ్మెల్యేల పనితీరు, ప్రవర్తన నచ్చని వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంకు అనుకూల ఫలితాలు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.