విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్టు ఉన్న సంగతి అందరికీ ఈపాటికే అర్థమైంది. కేంద్రంలో బీజీపీతో సఖ్యతతో ఉన్న జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్దగా వ్యతిరేకత తెలపడంలేదు. సంప్రదాయం ప్రకారం ప్రైవేటీకరణ ఆపండి అంటూ ఒక లేఖరాసేసి చేతులు దులుపుకున్నారు అంతే. ఇక చిన్న చిన్న విషయాలకే నానా రాద్ధాంతం చేసే ఆ పార్టీ ఫైర్ బ్రాండ్లు కూడ నోరు మెదపడంలేదు. ఇదంతా కేవలం మోడీ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అధికార పార్టీ కాబట్టి ఉద్యమాలు లేవదీసుకుని పాలన మీద ప్రభావం చూపుకోలేదు. కేంద్రానికి ఎదురుతిరిగి తిప్పలు కొనితెచ్చుకోలేదు.
ఇక మిగిలిందల్లా ప్రతిపక్షం తెలుగుదేశమే. వీరి పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. నిజానికి గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీకి మిగతా ప్రాంతాలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఆదరణ దొరికిందనే అనాలి. ఏ అడ్డంకులూ లేకుంటే ఈ స్టీల్ ప్లాంట్ అంశాన్ని బేషుగ్గా వాడుకుని చంద్రబాబు బోలెడంత మైలేజ్ పొందేవారు. ఈపాటికి స్టీల్ ప్లాంట్ గేటు ముందు టెంటు వేసుకుని దీక్షలకు దిగేవారు. కేంద్ర ప్రభుత్వంతో అవసరం, మోడీ అనుగ్రహం కోసమా పాకులాట లేకపోతే ఎన్నికలకు ముందు ఎలాగైతే రెచ్చిపోయారో అంతకు 10 రెట్లు రెచ్చిపోయేవారే. కానీ బీజేపీతో పొత్తు కోరుకుంటున్నారు ఆయన. మోడీని ఎలాగైనా తనవైపుకు తిప్పుకునే యోచనలో ఉన్నారు.
ఇప్పటికే అనేక రాయబారాలు నడిచాయి. ఏదీ ఫలించలేదు. అయినా ఆయన ప్రయత్నం మానట్లేదు. ఇలాంటి సమయంలో మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమం, పోరాటం అంటే సంబంధాలు మరింత చెడిపోతాయి. ఇక మీదట మోడీ నుండి సపోర్ట్ దొరుకుంతుందనే ఆశలు పెట్టుకోవడం కూడ వృథా. అందుకే చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అన్నట్టు అయింది. మింగలేక కక్కలేక నలిగిపోతున్నారు. ఉధృతంగా ఉద్యమం చేయమని శ్రేణులను ప్రోత్సహించలేకున్నారు. తెగించి నోరు పెద్దది చేసి మోడీ మీద మాటల తూటాలు పేల్చలేకున్నారు. ఎంతసేపటికీ తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అంటున్నారు తప్ప కేంద్రం మీద నోరెత్తట్లేదు. వైసీపీ నాయకులూ, మీడియా వెళ్లి మోడీనే నిలదీయండి, మీ హయాంలోనే ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది అంటూ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో తోచక నీళ్లు మింగుతున్నారు. జగన్ మీద పైచేయి సాధించడానికి స్టీల్ ప్లాంట్ రూపంలో వచ్చిన గొప్ప అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్న ఆయన పరిస్థితి చూస్తే జగన్ సైతం జాలిపడుతుంటారు.