ఇటీవల కాలంలో ఆంధ్రాలో దళితులపై దాడులు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే దళితుల మీద వరుస దాడులు జరగడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇక ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయితే ఈ అంశాన్ని బాగా వాడుకుంది. చంద్రబాబు నాయుడు ఈ దాడులను పెద్ద రాజకీయం చేయాలని అనుకున్నారు. నిజానికి ప్రత్యర్థుల విషయంలో ఇలాంటి వివాదాలను గాలివానలా మార్చేసి ప్రయోజనం పొందాలని ఏ రాజకీయ పార్టీ అయినా అనుకునేదే. కానీ చంద్రబాబు కొద్దిగా ఎక్కువ ఆశపడ్డారు. వివాదాల్లో దళిత సామాజికవర్గం అనే పేరు వినబడితే చాలు జగన్ మీద విరుచుకుపడిపోవడం చేశారు. అసలేం జరిగింది, తప్పెవరిది, తాను మద్దతిస్తున్న వ్యక్తి దళితుడే కావొచ్చు కానీ ఎలాంటి వ్యక్తి అనేది చూసుకోకుండా చెలరేగిపోయారు.
ఇప్పుడు అదే ఆయన పరువును తీసేసింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని ఇసుక అక్రమ రవాణా వాహనాలకు అడ్డుతగిలాడనే కారణంగా పోలీసులే స్టేషన్లో పెట్టి చితగ్గొట్టి శిరోముండనం చేసిన ఉదంతం, శిరోముండనం గావించబడి తీవ్ర అవమానానికి గురైన దళిత యువకుడు శ్రీకాంత్, రాజమహేంద్రవరంలో 16 ఏళ్ల ఎస్సీ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన, ప్రకాశం జిల్లాలో ముఖానికి మాస్క్ కట్టుకోలేదనే కారణంతో కిరణ్ కుమార్ అనే దళిత యువకుడిని చీరాల ఎస్సై చితకబాదగా ఆటను చికిత్స పొందుతూ కన్నుమూయడం వంటి వివాదాల్లో దళితుల తరపున మాట్లాడారు అంటే అర్థం ఉంది. ఎందుకంటే ఇందులో బాధితుల పక్షాన న్యాయం కనబడుతోంది కాబట్టి.
కానీ సస్పెండైన జడ్జి రామకృష్ణ విషయంలో దళిత కార్డును వాడుకోవాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం చివరికి ఆయన మీదకే రివర్స్ అయింది. 2013లో రామకృష్ణకు సస్పెండ్ చేశారు. ఇదంతా కేవలం రిటైర్డ్ జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తమ్ముడు పవన్‌కుమార్ రెడ్డి ఎర్రచందనం కేసులో ముద్దాయిగా ఉండగా కేసు నుంచి అతన్ని తప్పించాలని నాగార్జునరెడ్డి ఒత్తిడి తేగా, అందుకు రామకృష్ణ అంగీకరించకపోవడంతో సస్పెండ్ చేశారని, దాని వెనుక ప్రస్తుత వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. రామకృష్ణ కూడ అదే అనేవారు. ఇటీవల జస్టిసి ఈశ్వరయ్యతో జరిగిన సంభాషణలను రామకృష్ణ బయటపెట్టి చంద్రబాబుకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చారు. వాటిని పట్టుకుని బాబుగారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
కొన్ని రోజుల క్రితం రామకృష్ణ, ఆయన సోదరుడి మీద దాడి జరగ్గా ఆ దాడి వెనుక పెద్దిరెడ్డి ఉన్నారని చంద్రబాబు గోల గోల చేశారు. దళితులకు రాష్ట్రంలో రక్షణ లేదా, దళిత వ్యక్తి జడ్జిగా ఉంటే మీకు గిట్టదా, రామకృష్ణకు 8 ఏళ్లుగా టార్చర్ పెడుతున్నారు, ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమంటూ షో చేశారు. కానీ తీరా చూస్తే నిన్న సదరు రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. రామకృష్ణపై మదనపల్లె పోలీసు స్టేషన్ లో కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. రామకృష్ణ పిన్నమ్మ మరణించిన తర్వాత కూడా ఆమె పింఛన్ ను ఫోర్జరీ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడని బ్యాంక్ మేనేజర్ ఆరోపించారు. ఈ సంగతి తెలిసి జనం ఇలాంటి వ్యక్తినా బాబుగారు వెనకేసుకొచ్చింది. ఏదో నీతి, నిజాయితీ అన్నారు. ఇప్పుడు రామకృష్ణ అరెస్టయ్యారు. చంద్రబాబు ఏం చెబుతారో చెప్పండి అంటూ చురకలు వేస్తున్నారు.