తన రాజకీయ జీవితంలో మొదటిసారి బాబు ఒక విషయంపై మెలిక లేకుండా, రెండుకళ్ల సిద్ధాంతం వంటి లాజిక్కులు లేకుండా స్పష్టంగా ఒక విషయం ప్రకటించారు. అవును… టీడీపీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతే కంటిన్యూ అవుతుందని… మూడు రాజధానులనే ముచ్చటే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏవరేమనుకున్నా తగ్గేదే లేదని.. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లాక.. నాలుక మడతపేట్టేది లేదనేస్థాయిలో బాబు స్పష్టంగా చెప్పారు.
అవును… ఇంతకాలానికి చంద్రబాబు నాయుడు ఒక విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. రాజధాని నియోజకవర్గం తాడికొండలో పర్యటించిన బాబు… టీడీపీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతే కంటిన్యూ అవుతుందని తేల్చి చెప్పారు. అనంతరం అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని, ప్రపంచపటంలో అమరావతిని గొప్పగా నిలబెడతానని చెప్పుకొచ్చారు. అమరావతి గొప్ప రాజధాని అని బాబు తెలిపారు.
ఈ సందర్భంగా పాత విషయాలనే ప్రస్థావించిన బాబు… రూ. 5 లక్షల కోట్లుంటే ప్రపంచ స్థాయి రాజధాని వచ్చేదని, తర్వాత లక్షల కోట్ల సంపద సృష్టి జరిగేదనే చెప్పుకొచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం… ఐదు లక్షల కోట్లు ఒక్క రాజధాని ప్రాంతంలో పెట్టడమనేది ప్రాక్టికల్ గా ఎంత వరకూ సాధ్యమో బాబుకి తెలియంది కాదు. అయినా కూడా అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నందుకు బాబు అలా మాట్లాడారేమో తెలియని పరిస్థితి.
దీంతో… బాబుపై కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు వైకాపా నేతలు. లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసమే రూ. 5 లక్షల కోట్లు ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు అధికారంలో ఉన్న సమయంలో కూడా బాబు సమాధానం చెప్పలేదు. కానీ… “సెల్ఫ్ ఫైనాన్సింగ్” అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో… ఈ అర్థం లేని కబుర్లను క్యాష్ చేసుకున్న జగన్… 2019 ఎన్నికల్లో బాబుని చితక్కొట్టేశారు.
ఇదే క్రమంలో కేంద్రమే విడతలవారీగా లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు… అప్పట్లో మొదటి విడతగా రూ. 1.10 లక్షల కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు. అయితే… కేంద్రం కనీసం అక్ నాలెడ్జ్ మెంట్ కూడా పంపిన పాపాన పోలేదు. ఆ సంగతులు అలా ఉంటే… మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమరావతే రాజధానిగా ఉంటుందని బాబు బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది.
రాజధానుల విషయంలో కూడా రెండు కళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకుపోవాల్సిన సమయంలో… అమరావతి విషయంలో ఇంత రిస్క్ అవసరమా అని ఉత్తరాంధ్ర, సీమ నేతలు చెవులు కొరుక్కుంటుంటే… రాజధానికి భూములిచ్చిన వారు మాత్రం బాబు మాటలతో కాస్త హ్యాపీ ఫీలవుతున్నారంట. దీంతో… ఈసారి అమరావతే రాజధాని అని బాబు ఎన్నికలకు వెళ్లనుండగా… మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అని.. మరి ముఖ్యంగా విశాఖ పరిపాలనా రాజధాని అని జగన్ ఎన్నికలకు వెళ్లనున్నారన్నమాట!