విశాఖ రాజధానికి పేరు మార్చిన బాబు!

ఏపీ రాజకీయాల్లో రాజధాని అంశం ఈసారి ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా జగన్ స్ట్రైట్ గా ముందుకు పోతుంటే… చంద్రబాబు మాత్రం ఏ రోటికాడ ఆ పాటపాడుతూ నెట్టుకొస్తున్నారు. ఈ సమయంలో విశాఖ రాజధాని విషయంలో తన మనసులో మాట బయటపెట్టారు.

తాజాగా విశాఖలో రోడ్ షో లో పాల్గొన్న చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో మద్దతుగా చేతులెత్తండి అంటే రోడ్ షోకి వచ్చిన జనాలు కొంతమంది చేతులు ఎత్తారు! రాష్ట్రంలో ఏ జిల్లా వాసులనైనా… మీ ప్రాంతంలో రాజధాని కావాలా అని అడిగితే… వద్దు వద్దు… అని ఎవరైనా అంటారా? కానీ చంద్రబాబు రోడ్ షో లో పాల్గొన్న ప్రజానికం (మెజారిటీ ప్రజలు విశాఖ వారో కాదో తెలియదు) విశాఖ రాజధానిగా వద్దు అని తేల్చేశారు!

అయినా కూడా బాబుకు లోలోపల ఆందోళన నెలకొందో.. లేక, బెడిసికొడితే కష్టం అని భావించారో కానీ… విశాఖ కూడా తన దృష్టిలో రాజధానే అని… అది ఏపీకి ఆర్ధిక రాజధాని అని ప్రకటించారు. జగన్ ఏమో.. విశాఖ పరిపాలనా రాజధాని, అమరావతేమో శాసన రాజధాని అని కచ్చితంగా చెబుతుంటే… బాబు మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి… విశాఖను ఆర్ధిక రాజధానిగా ప్రకటించారు.

కాగా… గతంలో విశాఖను రాజధానిగా అంగీకరించని చంద్రబాబును 2020 ఫిబ్రవరి 25న ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్న విశాఖ ప్రజానికం… వచ్చిన విమానంలోనే తిరిగి పంపించేసిన సంగతి తెలిసిందే!