చిత్తుచిత్తుగా ఓడినా చంద్రబాబుకు ఆనందంగానే ఉంది.. రీజన్ ఆయనే !

Chandrababu enjoying GHMC results 
తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయని తరచూ రుజువవుతూనే ఉంది.  అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని స్థానిక సంస్థల ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పట్టించుకునేవారే లేరు.  ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా అయిందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అలా తయారైంది.  ఈ గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి  ఒక్కరంటే ఒక్కరు కూడ గెలవలేదు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.  నిజంగా ఇది చింతించాల్సిన విషయం.  హైదరాబాద్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా చంద్రబాబు చెప్పే మాట.. హైటెక్ సిటీని కట్టింది నేను, సైబరబాద్ నా ముందుచూపు ఫలితం.  నేను లేకుంటే హైదరాబాద్ లేదు. అంటుంటారు.  ఈ మాటల్లో కొంత నిజం లేకపోలేదు.  హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లగలిగింది అంటే అది చంద్రబాబు కృషే.
 
Chandrababu enjoying GHMC results 
Chandrababu enjoying GHMC results
అలా నగర అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన చంద్రబాబుకు ఇప్పుడు అదే నగరంలో చోటు లేకుండా పోయింది.  ఎన్నడూ లేని విధంగా సున్నా స్థానాలతో నేలమట్టమైంది.  ఆంధ్రా సెటిలర్లు సైతం తెరాసను ఆదరించారు తప్ప టీడీపీని పట్టించుకోలేదు.  టీడీపీ జాతీయ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ దానికి జాతీయ అధ్యక్షుడిని నేను అనే చంద్రబాబుకు ఇది పెద్ద పరాభవమే.  అయినా కూడ ఆయన బాధపడట్లేదట.  పైగా ఫలితాలు చూసి ఆనందిస్తున్నారట.  అయితే ఆనందిస్తున్నది తన సున్నా రిజల్ట్స్ చూసి కాదు తెరాసకు భారీగా తగ్గినా స్థానాలను చూసి.  అవును గత ఎన్నికల్లో 99 సీట్లతో జయభేరీ మోగించిన టిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా 55 స్థానాలతో ఎలాగో పరువు మాత్రం నిలుపుకుంది.  
 
ఈ పరిణామంతో కేసీఆర్ పెద్ద షాక్ తిన్నారు.  తనకు తిరుగేలేదనుకుంటుంటే పాతాళ స్థాయిలో ఉన్న బీజేపీ దెబ్బతీయడం ఏమిటని మధనపడిపోతున్నారు.  ఒకరకంగా చెప్పాలంటే ఇంతకుముందులా సగర్వంగా ఉండలేకున్నారు.  ఇదే చంద్రబాబుకు నచ్చింది.  కేసీఆర్ అలా డీలాపడటం ఆయనకు ఆనందాన్ని ఇస్తోంది.  ఎందుకంటే చంద్రబాబుకు జగన్ కంటే కేసీఆర్ పెద్ద రాజకీయ శత్రువు.  రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలని కేసీఆర్ చేయని ప్రయత్నం  లేదు.  టీడీపీ నాయకులను వీలు దొరికినప్పుడల్లా ఆడుకున్నారు.  చంద్రబాబు నాయుడును అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.  ఓటుకు నోటు కేసును అడ్డం పెట్టుకుని ఉమ్మడి రాజధాని అయినప్పటికీ హైదరాబాద్ మీద చంద్రబాబు ఆశలు వదిలేసుకునేలా చేశారు. 
 
తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ నుండి ప్రభుత్వాన్ని పూర్తిగా మార్చుకునే పరిస్థితి కల్పించారు.  గత ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిని జగన్ ఎలా ఎంజాయ్ చేశారో కేసీఆర్ కూడ అలాగే చేశారు.  ఏపీలో టీడీపీని ఓడగొట్టడానికి ఎన్నికల్లో పోటీ చేయమన్నా చేస్తామని అన్నారు.  ఇవన్నీ చంద్రబాబుకు మనసులో ముద్రపడిపోయాయి.  కానీ ఏమీ చేయలేని పరిస్థితి.  మాట్లాడటం తప్ప కేసీఆర్ ను చిక్కుల్లో పడేసే శక్తి లేక చాలానే నిరుత్సాహపడ్డారు బాబు.  అలాంటి తరుణంలో గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఊహించని రీతిలో దెబ్బతినడం, జనంలో కేసీఅర్ పాలన మీద వ్యతిరేకత పుట్టుకురావడం ఆయనకు ఎక్కడలేని సంతోషాన్నిచ్చాయి.  అందుకే బీజేపీ విజయాన్ని తన విజయంగా ఫీలవుతున్నారు.