చంద్రబాబు-కాంగ్రెస్ లోగుట్టు బట్టబయలు

చంద్రబాబునాయుడు-కాంగ్రెస్ పార్టీ పొత్తుల విషయంలో లోగుట్టును కాంగ్రెస్ మాజీ నేత రవిచంద్రారెడ్డి బయటపెట్టారు. రవిచంద్రారెడ్డి మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండేవారు. అయితే, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలను సహించలేక బయటకు వచ్చేశారు. తర్వాత వైసిపిలో చేరి ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈరోజు ఉదయం రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టటమే లక్ష్యంతో చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుందన్నారు. ఎవరైనా బలోపేతమవటానికి ప్రయత్నిస్తారని కాని కాంగ్రెస్ మాత్రం జగన్  ను దెబ్బకొట్టి చంద్రబాబుకు లబ్ది చేకూర్చేందుకే పొత్తులు పెట్టుకుందంటూ మండిపడ్డారు.

ఆమధ్య కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశమైనపుడు ఢిల్లీ నుండి వచ్చిన ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాంది తదితరులు మాట్లాడుతూ, ప్రతీ నియోజకవర్గంలోను సుమారు 10 వేల ఓట్లు చీల్చాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తమకు చెప్పారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మొత్తం వైసిపికి పడకుండా కాంగ్రెస్ చీల్చుకోవాలని చెప్పారట.  అంతేకాకుండా ఎక్కడ అవకాశముంటే అక్కడ వైసిపిని టార్గెట్ గా పెట్టుకుని ఆరోపణలు, విమర్శలు  చేయాలని ఆదేశించారని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

మామూలుగా ఎక్కడైనా జరిగేదేమంటే అధికారపక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతాయి. 2014లో ఏపిలో బిజెపి, టిడిపిలు పవన్ మద్దతుతు కాంగ్రెస్ ను వ్యతిరేకించిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే మొన్నటి తెలంగాణాలో ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్, టిడిపిలు పొత్తులు పెట్టుకున్న విషయం అందరూ చూసిందే. కానీ ఏపిలో మాత్రం అధికారంలో ఉన్న చంద్రబాబును ఏమనకుండా ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి పైకి జనసేన, కాంగ్రెస్ లు బాణాలు ఎక్కుపెడుతున్నాయి.

కాంగ్రెస్ లోని ముఖ్యులతో ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు జగన్ నే టార్గెట్ చేసుకోవాలని చెప్పారట. అందుకని రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు చంద్రబాబు అవసరమైన నిధులను సమకూరుస్తారని కూడా రఘువీరా చెప్పటంతోనే తమలాంటి వాళ్ళందరూ వ్యతిరేకమైనట్లు రవిచంద్రారెడ్డి చెప్పటం విశేషం. కాంగ్రెస్ పార్టీని ఐఏఎస్ మాజీ అధికారి కొప్పుల రాజు నాశనం చేసేస్తున్నట్లు ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీలోని కీలక నేతలు కూడా రాజు అంటే భయపడిపోతున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి చంద్రబాబు, కాంగ్రెస్ పొత్తుల్లోని లోగుట్టును కాంగ్రెస్ మాజీ నేతలే బయటపెట్టటం గమనార్హం.