అడకత్తెరలో పోకచెక్క… చంద్రబాబు తాజా పరిస్థితి ఇదే?

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నచందంగా చంద్రబాబు పరిస్థితి మారిపోయిందని నిన్నమొన్నటివరకూ కామెంట్లు వినిపిస్తే… ఇప్పుడు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయిందని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం జనసేన వారాహి యాత్ర.. అనంతరం పవన్ పద్దతిలో వచ్చిన మార్పు!

అవును… 2019 ఎన్నికల ఫలితాలనుంచి తేరుకోవడానికి సుమారు మూడేళ్ల సమయం తీసుకున్న చంద్రబాబు… వైసీపీ దూకుడు తట్టుకోలేక అసెంబ్లీకి కూడా గైర్హాజరైన పరిస్థితి! 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను… అసెంబ్లీలో నిలబెట్టి కడిగేస్తుంటే… బాబు మైకులముందు బోరుమనాల్సిన పరిస్థితి వచ్చిందని అంటుంటారు. ఈ నేపథ్యంలో తాను చెప్పినట్లు ఆడే పేరు సంపాదించుకున్న పవన్ ని డైరెక్టుగా ఆశ్రయించడం చంద్రబాబుకు తప్పలేదు.

దీంతో… తాను తనకున్న సీనియారిటీతో మైకులముందు చెప్పలేకపోయినా… పవన్ తో చెప్పించారు. పొత్తు అనివార్యం అని అన్నారు. అందుకు వారు ఎంచుకున్న స్లోగన్… జగన్ ని గద్దెదింపడమే అని!! అయితే నిన్నమొన్నటివరకూ సీఎం సీఎం అని పిలిపించుకున్న పవన్ ని… పొత్తు అనివార్యం అయిన అనంతరం బాబు & కో కంట్రోల్ లో పెట్టగలిగారని అంటుంటారు. అప్పటినుంచి పదవుల విషయంలో పవన్ కాస్త జాగ్రత్తగానే మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

అయితే వారాహి రెండో విడత యాత్రలో భాగంగా వాలంటీర్లపై పవన్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితితుల్లో ఊహించని స్థాయిలో జనసేనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాలంటీర్లపై విమర్శలు చేస్తే.. జగన్ సర్కార్ ని ఇరుకునపెట్టొచ్చని భావించి ఉండోచ్చు పవన్. కానీ… అనూహ్యంగా ఏపీలో సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారు, వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్న వారు మొత్తం పవన్ పై తిరగబడటం మొదలుపెట్టారు.

గ్రామస్థాయిలో అయితే పవన్ పై పార్టీలకతీతంగా ఫైరవుతున్నారు పేద ప్రజలు. రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసుకుంటే చేసుకో.. మధ్యలో వాలంటీర్లపై ఈ ఏడుపెందుకు అంటూ ఫైరవుతున్నారు. దీంతో… ఇరకాటంలో పడిన పవన్.. సన్నాయి నొక్కులు నొక్కుతూ.. స్థిరత్వం లేని మాటలు మాట్లాడుతున్నారు. దీంతో… చంద్రబాబు పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిగా మారింది.

వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా చంద్రబాబు కూడా ఇరుకునపడినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల అనంతరం టీడీపీ నేతలు అంతా కలుగుల్లో దాక్కొన్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. పవన్ తెర వెనుక చంద్రబాబు లేరు అని అంటే నమ్మేటంత అమాయకులు ఏపీలో లేరనేది వారి వాదనగా ఉంది.

దీంతో… పవన్ అటు పవన్ వ్యాఖ్యలను ఖండించలేక, వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేక… సైలంటుగా వేడుక చూస్తున్నారని కొందరంటున్నారు. మరోపక్క… ఇటు పవన్ కి అటు వాలంటీర్లకూ మధ్య చంద్రబాబు నలిగిపోవడం కన్ ఫాం అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయంం ఏమిటంటే… పవన్ తో చంద్రబాబు కలిసి ఎన్నికలకు వెళ్తే… వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలను చంద్రబాబు సమర్ధించినట్లే లెక్క. అలా కాకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే… పవన్ వ్యాఖ్యలను ఖండించినట్లు లెక్క.. అప్పుడు పవన్ పాపంలో భాగం చంద్రబాబుకు రాకపోవచ్చని అంటున్నారు.

మరి వాలంటీర్లకంటే పవనే ఎక్కువని, అసలు పవన్ వ్యాఖ్యల వెనక ఉన్నది తానే అని చంద్రబాబు పొత్తులోనే ఎన్నికలకు వెళ్తారా… లేక, ఒంటరిగా వెళ్తారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా… ప్రస్తుతానికి ఈ వివాదం ముగిసేవారకూ బాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కే అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!