ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ చంద్రబాబులో ఆందోళన ఎక్కువైపోతుందని అంటున్నారు పరిశీలకులు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోతే మనుగడ ప్రశ్నార్ధకమే అని బలంగా నమ్ముతున్న బాబు… ఇదే సమయంలో తన గెలుపుపై కూడా కొత్తగా టెన్షన్ పడుతున్నారని చెబుతున్నారు. దీంతో… కీలక నిర్ణయం దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారని సమాచారం.
ఈసారి కుప్పంలో ఎలాగైనా సరే చంద్రబాబుని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపైన పూర్తి శ్రద్ధపెట్టారు. బాబుని ఈసారి కుప్పంలో ఓడించే బాధ్యత ఆయన తీసుకున్నారని చెబుతున్నారు. పైగా ఇంతకాలం బాబు గెలుపుకు కారణంగా ఆరోపిస్తున్న దొంగ ఓట్లను మొత్తం తొలగించే పనిలో ఉంది అధికార వైసీపీ.
దీంతో ఈసారి కుప్పం విషయంలో చంద్రబాబు పునరాలోచనలో ఉన్నారని చెబుతున్నారు. పైగా… గతంలో ప్రచారానికి కూడా వెళ్లని చంద్రబాబు ఇప్పుడు కుప్పంలో రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. అయినప్పటికీ కుప్పంలో చాపకింద నీరులా వైసీపీ బలోపేతం అవుతోందని సమాచారం.
ఇదే సమయంలో కుప్పం ఇన్ చార్జి భరత్ కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన వైసీపీ… చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కూడా కొనసాగించింది. ఈ బాధ్యతల్లో ఒక టర్మ్ పూర్తి చేసుకున్న భరత్ కు మరో అవకాశం కూడా ఇచ్చారు జగన్. తద్వారా చంద్రబాబు ప్రత్యర్థిపై పూర్తి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తోంది అధికార పార్టీ.
దీంతో చంద్రబాబు మదిలో కొత్త ఆలోచన పుట్టిందని చెబుతున్నారు. కుప్పాన్ని ఈసారి వదిలేసి.. వేరే నియోజకవర్గాన్ని ఎంచుకుంటే బెటరనే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. తన సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గం వైపు చూస్తున్నారని సమాచారం.
ఇదే సమయంలో కుప్పం నియోజకవర్గాన్ని ఉన్నఫలంగా వదిలేస్తే… జనం మరీ ఎద్దేవా చేస్తారనే ఆలోచన కూడా బాబులో ఉందని అంటున్నారు. ఫలితంగా… కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తే అది మంచి ఆలోచన అవుతుందేమో అని చెబుతున్నారు. పైగా తెలంగాణలో కేసీఆర్ కూడా అలానే చేస్తుండటంతో… తనపై విమర్శల దాడి కాస్త తక్కువగానే ఉండొచ్చని ఆలోచిస్తున్నరని అంటున్నారు!
మరి చంద్రబాబు కుప్పాన్ని వదిలేస్తారా.. లేక, కుప్పంలో కూడా పోటీ చేస్తారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ… చంద్రబాబుకి ఇలాంటి పరిస్థితి అనేది… చేసినోడికి చేసుకున్నంత మహదేవా అనే నానుడిని తెరపైకి తెస్తోంది!