అటు సంజయ్ – ఇటు చంద్రబాబు… లాజిక్ మిస్ అవుతున్నారు!

ఏపీలో చంద్రబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలొచ్చినప్పటినుంచి ఒకటే మాట చెబుతున్నారు. తనతో అధికారపార్టీ నేతలు టచ్ లో ఉన్నారని. అది కూడా ఒకరిద్దరు కాదు.. సుమారు 40 – 50 మంది! ఇక తెలంగాణలో కూడా టి.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా… మైకందుకున్న ప్రతీసారీ బీఆరెస్స్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.

ఇది చిన్న విషయం కాదు.. సింపుల్ విషయం కూడా కాదు.. చాలా గొప్ప విషయం. అధికారంలో ఉన్న పార్టీలను వదిలేసి.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలవైపు నేతలు రావాలని చూస్తున్నారంటే… ఆ ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఎగిరి గంతేయాలి.. అది సంజయ్ అయినా – చంద్రబాబైనా!

అవును.. అలా తనతో టచ్ లో ఉన్న 40-50 మంది వైకాపా ఎమ్మెల్యేలతో బాబు “డోంట్ బాదర్ – ప్లీజ్ కం – విల్ వర్క్ టుగెదర్” అని చెప్పి సైకిల్ ఎక్కించేసుకోవాలి. దీంతో… జగన్ ని మానసికంగా సరైన దెబ్బ కొట్టొచ్చు! ఫలితంగా జగన్ తో పాటు ఆ పార్టీ నేతల్లోనూ, కేడర్ లోనూ ఆత్మస్థైర్యం తగ్గించొచ్చు. కానీ… రాజ్యాంగంపై తనకున్న మితిమీరిన గౌరవం వల్లో.. పక్క పార్టీ సింబల్ తో గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకోవడం అనైతికమనో కానీ… అలవాటైన పని కూడా చంద్రబాబు చేయడం లేదు!

ఇక సంజయ్ విషయానికొస్తే… రాబోయే ఎన్నికల్లో బీఆరెస్స్ అధికారంలోకి రాదని అర్థమైపోయిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలని నిర్ణయించుకున్నారంట. బీజేపీలో కి వస్తే టికెట్ ఖాయమని హామీ ఇవ్వడం ఆలస్యం అంట… వెంటనే బీఆరెస్స్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారట. ఇది సంజయ్ చెప్పిన సంగతి.

మరి ఇంకెందుకు ఆలస్యం… అధికార పార్టీ నుండే ఎమ్మెల్యేలు వచ్చేసి ప్రతిపక్షంలోని బీజేపీలో చేరుతున్నారంటే జనాల్లో మంచి ఇమేజి పెరుగుతుంది కదా. 119 నియోజకవర్గాల్లో ఎలాగూ బీజేపీకి అన్నీచోట్లా గట్టి అభ్యర్థులు లేరు! కాబ్టటి బీఆరెస్స్ నుండి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలకు సీట్లు కన్ ఫాం చేసెయ్యొచ్చు కదా! ఫలితంగా కేసీఆర్ పై సొంత నేతలకే నమ్మకం లేదనే సందేశం తెలంగాణ ప్రజలకు పంపొచ్చు కదా! అయితే… కేసీఆర్ పై ప్రెమో.. లేక, ఇప్పటికే తమ పార్టీ తరుపున అన్ని నియోజకవర్గాల్లోనూ 3 – 4 అభ్యర్థులు పోటీపడుతున్నారనో తెలియదు కానీ… సంజయ్ మాత్రం ఆ పనిచేయడం లేదు.

దీంతో… వీరి మాటలపై రోజు రోజుకీ విశ్వసనీయత పడిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇంకా బండి సంజయ్ అయితే… హస్తినలోని అధిష్టానం పెద్దలతో మాట్లాడాలి, ఒప్పించాలి. కానీ… చంద్రబాబుకు ఆ సమస్య లేదు కదా. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి “ఎస్ బ్రదర్” అని చెబితే చాలు కదా! దీంతో… ఈ “టచ్” మాటల్లో ఎంతవరకు నిజముందో? అనే కామెంట్లు మొదలైపోయాయి!