జగన్ మరో గుడ్ న్యూస్: నిన్న 10వేల కోట్లు.. రేపు 12వేల కోట్లు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎన్నికల వేళ వరుసపెట్టి గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఎన్నికల ఏడాదిలో కేంద్రం పెండింగ్ వినతులను పరిష్కరిస్తోంది. ఇప్పటికే రెవెన్యూ డెఫిసిట్ కింద స్పెషల్ ఇన్సెంటీవ్ ప్యాకేజీ రూపంలో రూ.10 వేల కోట్లకు పైగా నిధులిచ్చిన కేంద్రం… తాజాగా పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు మంజూరు చేయాలని ఫిక్సయ్యింది.

రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. మొత్తం ఖర్చు కేంద్రమే భరించేలా నిర్ణయం జరిగింది. అయితే ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా… రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్వహణ చేపడుతుందని చెప్పి బాధ్యతలు తీసుకున్నారు. ఫలితంగా… ఆంధ్రుల ఆశలు పోస్ట్ పోన్ అయ్యాయి. నాటి టీడీపీ ప్రభుత్వం చేతకానితంతోనో, అజ్ఞానంతోనో, అలసత్వంతోనో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి!

అయితే తాజాగా హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన జగన్… కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమయ్యారు. పోలవరం నిర్మాణం విషయంలో సవరించిన అంచనా మేరకు ముందుగా అడహక్ నిధులు విడుదల చేయాలని కోరారు. తక్షణ నిధుల కింద రూ. 17,144 కోట్లు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో తాజాగా పోలవరం పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన జలశక్తి మంత్రి జగన్ రిక్వస్ట్ పై సానుకూలంగా స్పందించారు.

ఇదే విషయాలపై తాజాగా స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక ప్రకటన చేసారు. త్వరలో రూ.12వేల కోట్లకుపైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇస్తుందని వెల్లడించారు.

కాగా… 2014 -15 రెవిన్యూ లోటు కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి దక్కించుకోవటానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, కేంద్రం విడుదల చేయని సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్ధనతో ఆ నిధులు విడుదల అయ్యాయి. ఇదే సమయంలో పోలవరం నిధులపై కూడా తాజాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది!