2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. అసలు పేరు వీవీ లక్ష్మినారాయణ అయినా, ఆయన్ని అంతా జేడీ లక్ష్మినారాయణ అనే అంటుంటారు.
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో లక్ష్మినారాయణ పేరు మార్మోగిపోయింది. ఆయన్ని అప్పట్లో చాలామంది ‘రియల్ హీరో’గా భావించారు. ఆయన పేరుతో అభిమాన సంఘాలూ వెలిశాయి. అనూహ్యంగా ఆయన ఉద్యోగ విరమణ ముందే చేసి, రాజకీయాల్లోకి వచ్చారు.
వాస్తవానికి బీజేపీ నుంచి తొలుత ఆయనకు ఆఫర్ వచ్చిందంటారు. లోక్‌సత్తా పార్టీని టేకోవర్ చేయడానికీ లక్ష్మీనారాయణ ప్రయత్నించినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. చివరికి ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేన నుంచి పోటీ చేశారు. ఓటమి చవిచూశారు.
‘ఓడిపోయాననే బాధ నాకేమీ లేదు. ప్రజల్ని ప్రలోభ పెట్టకుండా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సంపాదించాను. ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నించిన నాకు ఓడిపోయినా ఆత్మసంతృప్తి కలిగింది’ అని పలు సందర్భాల్లో చెప్పారు లక్ష్మినారాయణ. తిరిగి ఆయన జనసేన నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా, ఆయనకు టీడీపీ తాజగా ‘కాదనలేని ఆఫర్’ ఇచ్చిందనే గుసగుసలు తెరపైకొచ్చాయి.
ఎటూ, జనసేనాని తిరిగి సినిమాల్లో నటించడం ఇష్టం లేక జనసేన పార్టీకి రాజీనామా చేశానని లక్ష్మినారాయణ చెప్పి మరీ, జనసేన నుంచి బయటకు వచ్చారు గనుక, తిరిగి ఆయన జనసేనలోకి వెళ్ళకపోవచ్చు. టీడీపీ నుంచి వచ్చిన ‘కాదనలేని ఆఫర్’ నిజమైతే, ఆయన త్వరలోనే టీడీపీలో చేరొచ్చు. ఏ పార్టీ నుంచి అయినాగానీ, విశాఖ నుంచే ఆయన పోటీ చేస్తారట.