గోడ మీద పిల్లి.! దూకెయ్యడం తప్పదేమో.!

ఉమ్మడి తూర్పోగోదావరి జిల్లాలో ఆయనో కీలకమైన నాయకుడు. మరీ అంత ప్రముఖమైన నాయకుడేం కాదు. కాకపోతే, వైసీపీ పుణ్యమా అని పాపులారిటీ పెంచుకున్నాడు. రాజ్యసభకూ వెళ్ళాడాయన. పరిచయం అక్కర్లేని పేరాయనది. ఆయనే పిల్లి సుభాష్ చంద్రబోస్.

గత కొంతకాలంగా సొంత పార్టీకే చెందిన మంత్రిగారితో పొసగడంలేదు ఈ రాజ్యసభ సభ్యుడికి. పైగా, కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆశపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలన్నదీ ఆయన కోరిక. అందుకు పరిస్థితులు అనుకూలించడంలేదు.

జిల్లాలో జనసేన ప్రభావం పెరుగుతున్న దరిమిలా, కాస్త జాగ్రత్త పడుతున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. టీడీపీ వైపుకి వెళ్ళాలనుకున్నారు.. బీజేపీలోకి వెళితే సేఫ్ అన్న ఆలోచనా చేశారు. కానీ, ఇప్పుడు జనసేన వైపు వెళ్ళేందుకు సమాయత్తమవుతున్నారు. దాంతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగారు.

సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులూ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బుజ్జగింపులు కొంత ఫలించి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మెత్తబడ్డారన్నది తాజా ఖబర్. మరోపక్క ఆయన రేపో మాపో జనసేన అధినేతను కలవబోతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది.

మలివిడత వారాహి విజయ యాత్ర కోసం జనసేన అధినేత సమాయత్తమవుతున్న దరిమిలా, అప్పటికల్లా పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక నిర్ణయం తీసుకుంటారేమో.. అన్నది జిల్లాలో ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుచరులైతే మానసికంగా సిద్ధమైపోయారట జనసేనలో చేరేందుకు.