‘రాజధాని అంటే విశాఖ.. విశాఖ అంటే రాజధాని.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం..’ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘రాజధాని కాబట్టే అమరావతికి మకాం మార్చాం’ అని 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మకాం విశాఖకు మార్చుతున్నారంటే, అమరావతికి వున్న రాజధాని హోదాని అనధికారికంగా తొలగించేస్తున్నట్టే. కానీ, రాజధానిగా అమరావతిని గుర్తిస్తున్నారు వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
‘రాజధాని అందరిదీ.. ఆ రాజధానిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకూడదంటూ కొందరు కోర్టును ఆశ్రయించడం హాస్యాస్పదం. అలాంటివారికి షాక్ తగిలింది. ఈ విషయంలో ప్రభుత్వానిది పూర్తి విజయం అని ఇప్పుడే చెప్పలేం..’ అంటున్నారు సలహాదారు సజ్జల.
అసలంటూ రాజధాని అమరావతి మీద తొలుత బురద చల్లిందే వైసీపీ. మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని ముంపు ప్రాంతమన్నారు. ఇంకో మంత్రి స్మశానమన్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఎడారి ప్రాంతాన్ని తలపిస్తోందని సెలవిచ్చారు.
అలాంటి చోట, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడాన్ని ప్రతిష్టాత్మకంగా చెబుతూ, రాజధాధాని అందరిదీ.. అని సజ్జల పేర్కొనడం రియలైజేషన్ అనుకోవాలేమో.! ఈ ప్రకటనతో, రాజధానిపై వైసీపీకి వున్న చిన్న చూపు తొలగిపోయిందని భావించొచ్చా.?