జగన్-కేటీఆర్ భేటీ! టీడీపికి ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు దడ

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ప్రాథ‌మిక స్థాయిలో జరిగిన ఓ భేటీ.. తెలుగుదేశంలో కాక పుట్టించింది. వారి నోళ్లకు పని చెప్పింది. వెనుకా ముందూ చూసుకోకుండా జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించేలా ప్రేరేపించింది. తమ నోటి దాకా వచ్చిన ముద్దను తన్నుకుపోయారనే అక్కసు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది.

చంద్రబాబు మొదలుకుని ద్వితీయ శ్రేణి నాయకుల వరకూ జగన్-కేటీఆర్‌ భేటీని భూతద్దంలో చూస్తున్నారు. జగన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఈ రేంజ్‌లో టీడీపీ నాయకులు చెలరేగి పోవడానికి రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి- వెలమ సామాజిక వర్గ ఓటు బ్యాంకు.

జగన్, కేటీఆర్ మధ్య జరిగిన సమావేశం తరువాత వెలమ సామాజిక వర్గ ఓటర్లు త‌మ‌కు దూరం అవుతారనే అభద్రతా భావం టీడీపీలో నెలకొందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వెలమ ఓటర్లు ఉత్తరాంధ్రలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల సంఖ్య వారిది.

వెలమ ఓటర్లలో కేసీఆర్‌ను అభిమానించే, ఆరాధించే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. విశాఖ శారదా పీఠాన్ని సందర్శించడానికి కేసీఆర్ వచ్చినప్పుడు ఆ సామాజిక వర్గ నాయకులు పెద్ద సంఖ్యలో బ్యానర్లు కట్టారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు.

నిజానికి ఈ మూడు జిల్లాలూ టీడీపీకి కంచుకోటల్లాంటివే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తప్ప ఆవిర్బావం నుంచీ టీడీపీకి అండగా ఉంటూ వచ్చాయి. టీడీపీ అంతలా బలం పుంజుకోవడానికి వెలమ సామాజిక వర్గ ఓటర్లు కీలకంగా వ్యవహరించారు. ఈ పరిస్థితుల్లో అదే సామాజిక వర్గానికి చెందిన కేటీఆర్.. ప్రతిపక్ష నేతతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వెలమ ఓటర్లు జగన్ వైపు మొగ్గు చూపుతారనే బలమైన అభిప్రాయం ఏర్పడింది.

ఇప్పటికే- ఈ మూడు జిల్లాల్లో టీడీపీ అంటే పెదవి విరుస్తున్నారు జనం. ఈ మూడు జిల్లాల్లో జగన్ పాదయాత్రకు లభించిన ప్రజాదరణే దీనికి నిదర్శనం. దీనికితోడు- ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, సుజయ కృష్ణ రంగారావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య ఒకరంటే ఒకరికి పడదు.

`ఫిరాయింపు మంత్రి`గా సుజయకు పేరుంది. ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనివ్వట్లేదనే ఆరోపణలు అచ్చెన్నాయుడుపై ఉన్నాయి. గంటా శ్రీనివాస రావు, అయ్యన్నపాత్రుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. వెరసి- రాజకీయంగా జగన్ లబ్ది పొందుతార‌ని అంటున్నారు.

కేసీఆర్‌పై ఏపీ ప్రజలకు మొదట్లో ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు లేదు. ఆ వ్య‌తిరేక‌తే ఉండి ఉంటే- ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రోలా ఉండేవి. హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులు కూడా కేసీఆర్ పాలనకే ఓటు వేస్తున్నారు. 2015లో జీహెచ్ఎంసీ, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమైంది. ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య వైషమ్యాలను తాము కోరువట్లేదని, అభివృద్ధి వైపే ఉన్నామని తమ ఓటు హక్కు ద్వారా తెలియజేశారు హైదరాబాద్లోని సీమాంధ్రులు.

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలిచి తీరుతామనుకున్న కూకట్‌ప‌ల్లి, శేరి లింగంపల్లి వంటి స్థానాల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది టీడీపీ. టీఆర్ఎస్‌పై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు సీమాంధ్ర ఓటర్లు.

ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీతో టీఆర్ఎస్ చేతులు క‌ల‌ప‌డం వల్ల ఉత్తరాంధ్రలో అధికంగా ఉండే వెలమ ఓటర్లు పూర్తిగా జగన్ వైపునకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఇది వైఎస్ఆర్‌సీపీకి కలిసివచ్చే విషయమే. టీడీపీలో భయానికి ఇదే ప్రధాన కారణమని అంటున్నారు.