రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఈనెల 22న ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజనకు మందు టిడిపి నుంచి బయటికి వచ్చారు బైరెడ్డి. అప్పుడే రాయలసీయ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత దాన్ని మూసేశారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. అయితే రాయలసీమలో ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారని వార్తలొచ్చాయి. అనుకున్నట్లుగానే ఆయన ఈనెల 22న రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరిగి అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రా, రాయలసీమ నేతలంతా మూకుమ్మడిగా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు.తెలంగాణను ఆపుతామంటూ బీరాలు పలికారు.. కానీ బైరెడ్డి ఒక్కడే తెలంగాణ ఆపలేమని తేల్చేశారు. సమైక్యం లేదు గిమైక్యం లేదు అంటూ సమైక్యవాదులపై ఎదురుదాడికి దిగారు. సమైక్యవాదం అనేది చచ్చిన శవంతో సమానం అంటూ ఆయన నిప్పులు చెరిగారు. చచ్చిన శవంతో సంసారం చేయలేరని కూడా సీమాంధ్ర నేతలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. తెలంగాణను ఏ శక్తి ఆపలేదని, ఇక రాయలసీమ నేతలు, ఆంధ్రా నేతలు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కానీ బైరెడ్డి ఒక్కరు ఒకవైపు మిగిలిన యావత్ మంది ఒకవైపు నిలిచారు. వారంతా బైరెడ్డి ముందు ఓడిపోయారు. తెలంగాణను ఆపుతామంటూ సీమాంధ్ర నేతలు చేసిన ప్రకటనలను బైరెడ్డి తీవ్రంగా ఖండించారు. అంతిమంగా బైరెడ్డి చెప్పింది అక్షర సత్యం అయింది. సీమాంధ్ర నేతలు అక్కడి ప్రజల ప్రయోజనాలు వదిలేసి హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల రక్షణ కోసమే వెంపర్లాడారన్నది తేలిపోయింది. బైరెడ్డి చెప్పినట్లు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా (హైదరాబాద్ ఆస్తుల కోసమే) పోరాటం చేయకుండా సీమాంధ్ర హక్కుల కోసం చేసి ఉంటే ఇప్పటికే పటిష్టమైన వెసులుబాట్లు సీమాంధ్రకు వచ్చేవన్న వాదనను ఇప్పుడు జనాలు గుర్తు చేస్తున్నారు.
ఇదీ బైరెడ్డి బ్యాక్ గ్రౌండ్…
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంది కొట్కూరు నియోజక వర్గం నుంచి 1994, 1999 ఎన్నికలలో టిడిపి తరపున పోటి చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓడిపోయారు. 2009లో నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వు అయ్యింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు పరిధిలో ఉన్న ఓర్వకల్లు మండలం పాణ్యం నియోజకవర్గానికి మారింది. దీంతో బైరెడ్డి 2009లో పాణ్యం నియోజక వర్గం నుంచి పోటి చేసి ఓడిపోయారు. ఆ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బైరెడ్డి సెప్టెంబర్ 2012లో టిడిపిని వీడి రాయలసీయ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. అలా ప్రత్యేక సీమ కావాలని, రాయల తెలంగాణ అయినా ఇవ్వాలని బస్సుయాత్రలు, పాదయాత్రలు చేశారు. భారీ సభలు ఏర్పాటు చేశారు. 2013 సెప్టెంబర్ 5 న ఆర్పీఎస్‌ను రాజకీయ పార్టీగా బైరెడ్డి ప్రకటించారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటి చేయకుండా తన కూతురు బైరెడ్డి శబరిని ఆర్పీఎస్ తరపున పాణ్యం నియోజకవర్గం నుంచి పోటికి నిలిపారు. ఆమె ఆ ఎన్నికల్లో ఓటమిపాలైంది. అయినా బైరెడ్డి తన సీమ నినాదాన్ని ఎత్తుకుని ముందుకు సాగారు.
నంద్యాల ఉపఎన్నికల తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాను ఏర్పాటు చేసిన రాయలసీమ పరిరక్షణ సమితిని సెప్టెంబర్ 06,2017న మచ్చుమర్రు వేదికగా దానిని మూసివేశారు. ఆయన టిడిపిలో చేరుతారన్న వార్తలు బలంగా వినిపించాయి. ఆ తర్వాత ఆయన 28 డిసెంబర్ 2017 న సీఎం చంద్రబాబుతో సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఆయన టిడిపిలో చేరిక ఇక ఖాయమే అని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ ఊమెన్ చాందీ ఇటీవ బైరెడ్డి తో చర్చలు జరిపారు. బైరెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు లేనిచో రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారట. బైరెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చారు.