ఏపీలో అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డితో వచ్చిన విబేధాల కారణంగానే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం బైరెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
కర్నూలు డిసిసి అధ్యక్షుడు అలీ ఖాన్ నియామకంలో రఘువీరాతో బైరెడ్డి విభేదించారు. బైరెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దాని పై ఇంకా సమాచారం లేదు. బైరెడ్డి టిడిపి తరపున 1994 లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయాన ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడారు. రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. 3000 కిలోమీటర్లు ట్రాక్టర్ల యాత్ర చేపట్టి రాయలసీమ ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో కొనసాగలేదు. కొన్ని నెలల కిందటే బైరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇంతలోనే ఆయన రాజీనామా కలకలం సృష్టిస్తోంది.