ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల… ఎవరికి ప్లస్, మరెవరికి మైనస్?

మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో గెలిచేసరికి దక్షిణాదిపై మరింత పట్టు సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ ఎంతోకొంత పట్టు సాధించాలని చూస్తుంది. ఇందులో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషి అని, కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు అని చెప్పుకుంటూ ఆయన కుమార్తెగా షర్మిళను రంగంలోకి దింపాలని చూస్తుందని తెలుస్తుంది. అదే నిజమైతే ఈమె రాక ఏపీలో ఎవరికి ప్లస్సు, మరెవరికి మైనస్సు అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైపోయింది.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయిన సంగతి తెలిసిందే. అసలు ఏపీలో ఆ పార్టీ ఊసేలేదన్నా అతిశయోక్తి కాదు. ఏపీలో ఆ పార్టీ జెండాలు కనిపించి కూడా చాలా కాలమే అయ్యింది. వైఎస్సార్ బ్రతికున్న రోజుల్లో వైభవాన్ని చూసిన ఆ పార్టీ… ఆయన మరణానంతరం జరిగిన అనేక పరిణామాలతో ఏపీలో కనుమరుగైంది! అయితే.. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆ పార్టీ… గతాన్ని గుర్తు చేసుకుంటూ.. గత వైభవం కోసం షర్మిళను రంగంలోకి దింపాలని చూస్తుందని తెలుస్తుంది.

ఆ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా షర్మిళను ముందుపెట్టి కాంగ్రెస్స్ పార్టీ మళ్లీ రంగంలోకి దిగాలని చూస్తుంది. ఈ సమయంలో సునీల్ కనుగోలుకు ఏపీ బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారని అంటున్నారు. అదే జరిగితే వైఎస్ జగన్ కు ప్లస్సయ్యే అవకాశం ఉందని కొందరంటే.. లేదు.. వైఎస్ జగన్ కు నష్టమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన కారణంగా జనాలు కాంగ్రెస్ పార్టీని తవ్వి పాతరేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పటికిప్పుడు షర్మిల వచ్చినా, తెలంగాణలో కాంగ్రెస్ వారు గెలిచారని చెప్పుకున్నా ఏపీలో అద్భుతాలు చేసేస్తుందని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే అన్నీ పార్టీల్లోనూ ఎంతో కొంత డిస్ట్రబెన్స్ ఉండచ్చని మాత్రం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధానంగా షర్మిల ఎంట్రీతో వైసీపీకి నష్టమని, కాదు కాదు ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే ప్రతిపక్షాలకే నష్టమని ఇలా రకరకాల వాదనలు మొదలయ్యాయి. ఈ సమయంలో ఏపీ బాధ్యతలు తీసుకోమని కాంగ్రెస్ అగ్రనేతలు షర్మిలకు చెప్పినా.. అంగీకరించని కొందరు అంటున్నారు. అసలు అన్నతో ప్రత్యక్ష పోరుకు అంగీకరించకే తెలంగాణ ప్రత్యేక కుంపటి పెట్టుకున్నారని చెబుతున్నారు. మరి ఇంతకూ ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు షర్మిళకు ఇస్తే… కాంగ్రెస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానికంటే ముందు అసలు అందుకు ఆమె అంగీకరిస్తారా లేదా అన్నది ప్రధాన అంశం. సో… వెయిట్ అండ్ సీ!