ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించేలా షర్మిల వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ నిధులతో సుమారు 5 వేల దేవాలయాల నిర్మాణం చేపట్టాలని ప్రకటించగా, దేవాలయాల నిర్మాణాలు ఆర్ఎస్ఎస్ ఎజెండా అని షర్మిల వ్యాఖ్యానించడాన్ని మాధవ్ తప్పుబట్టారు.
సోమవారం (నేడు) మీడియాతో మాట్లాడిన పీవీఎన్ మాధవ్, షర్మిలకు దేవాలయాల వ్యవస్థపై ఎటువంటి అవగాహన, ఆలోచన లేదని విమర్శించారు. ఆమె జీవితంలో ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా? అని ప్రశ్నించారు.
కీలక ఆరోపణలు: షర్మిల స్వయంగా తన భర్తతో కలిసి మత ప్రచారాలు చేశారని మాధవ్ ఆరోపించారు. మత మార్పిడి చేయాలని పెద్ద ప్రయత్నం చేశారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై పరిజ్ఞానం లేకుండా, అవివేకంగా షర్మిల మాట్లాడారని మాధవ్ విమర్శించారు.
టీటీడీపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు.
దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గతంలో ఏడుకొండలు మూడు కొండలుగా మార్చాలని జీవో ఇచ్చారని ఈ సందర్భంగా మాధవ్ గుర్తు చేశారు. టీటీడీ నిధులు ఎలాంటి దుర్వినియోగం అవ్వడం లేదని స్పష్టం చేశారు. ఈ నిధులను ఆలయాల నిర్మాణాలు, ధార్మిక సంస్థల నిర్మాణం, ధూపదీప నైవేద్యం కోసం ఉపయోగించుకుంటున్నారని మాధవ్ వివరించారు.

