రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉందనేది వాస్తవం. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, పయ్యావుల కేశవ్ మినహా మిగతా టీడీపీ లీడర్లంతా చిత్తుగా ఓడిపోయారు. సీమ పూర్తిగా వైసీపీ వశమైంది. మొదటి నుండి కడప సహా సీమ జిల్లాలు అన్నింటిలోనూ వైఎస్ కుటుంబం హవా ఉంటూనే ఉంది. గత ఎన్నికల్లో అది రెట్టింపు స్థాయిలో కనబడింది. దీంతో తెలుగుదేశంలో గట్టి నాయకులు అనబడేవారు కూడ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కొందరు వైసీపీని ఢీకొట్టలేక తోకముడిస్తే ఇంకొందరు స్వీయ భద్రత కోసం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అసలు పరిటాల, జేసీ కుటుంబాలే ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాయంటే వారి మీద జగన్ ప్రభావం ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి చోట ఒకే ఒక్క టీడీపీ లీడర్ మాత్రం ఏటికి ఎదురీదినట్టు అధికార పార్టీతో ఫైట్ చేస్తున్నారు. అతనే బీటెక్ రవి. అది కూడ జగన్ సొంత జిల్లా కడపలో కావడం మరొక పెద్ద విశేషం. టీడీపీలో ప్రవేశించినప్పటి నుండి బీటెక్ రవి దూకుడుగానే ఉండేవారు. విద్యావంతుడు కావడం, నమ్మకంగా ఉండటంతో చంద్రబాబు నాయుడు కూడ ఆయనకు పూర్తిస్థాయి మద్దతిచ్చేవారు. రవి కూడ కడపలో పార్టీని నిలబెట్టాలని గట్టిగా పనిచేసేవారు. అందుకే ఆయన మీద తెలుగుదేశం శ్రేణులకు మంచి విశ్వాసం. ఎవరున్నా లేకున్నా కడపలో పార్టీని ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం రవికుందని నమ్మేవారు. ఆ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవికి అవకాశం ఇచ్చారు.
రవి ఏకంగా జగన్ బాబాయి, వైఎస్ ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మీదనే ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొంది మీసం మెలేశారు. ఈ విజయంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వైసీపీ నేతలు తెలుగుదేశంలో ఎవరినైనా ఈజీగానే అదిలించేవారు కానీ బెటెక్ రవి విషయానికొస్తే వారి పప్పులు ఉడకట్లేదు. రవి బెదరకపోగా ఎదురుతిరుగుతున్నారు. కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు వీలు లేని చోట కూడ అవకాశాన్ని కల్పించుకుని మరీ పాలక పక్షాన్ని ఎండగడుతున్నారు. ఇటీవల గండికోట ప్రాజెక్టు ముంపు పరిహారం విషయంలో జరిగిన కొట్లాటల్లో టీడీపీ గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి మరణించాడు. అతను రామసుబ్బారెడ్డి ముఖ్య అనుచరుడు. రామసుబ్బారెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉండి ఇప్పుడు వైసీపీలో ఉంటున్నారు. అందుకే అనుచరుడి మరణం కలచివేస్తున్న మిన్నకుండిపోయారు.
కానీ రవి మాత్రం వదల్లేదు. గురునాథ్ రెడ్డి హత్యను రాజకీయ హత్యగానో, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి మధ్య జరిగిన ఆధిపత్య పోరుగానో చిత్రీకరించడం దారుణం. గండికోట ముంపు వాసులకు పరిహారంలో భాగంగా జరిగిన అక్రమాలపై గురునాథ్ రెడ్డి పోరాడారు. అందుకే హత్య కాబడ్డారు. ముంపు పరిహారం చెల్లింపుల్లో లేని లబ్ధిదారుల పేర్లు చేర్చి దోచుకుంటున్నారు. ఈ అక్రమాలు మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ పట్టుబడుతున్నారు. నేరుగా వైసీపీ నేతలు పేర్లను సంభోదిస్తూ అవినీతి లెక్కలు చెప్పేస్తున్నారు. ఒకానొక దశలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు రవి. అందుకే ఆయనంటే వైసీపీ నేతలు కొద్దిగా ఆలోచిస్తున్నారు.