తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆరెస్స్ కు ఊహించని షాక్ ఇచ్చారు. బీఆరెస్స్ ను 39 సీట్లకు పరిమితం చేసి కాంగ్రెస్ కు సింగిల్ గా ప్రభుత్వాన్ని నెలకొల్పేలా 64 స్థానాల్లో గెలుపొందించారు. ఈ సమయంలో బీఆరెస్స్ నేతల పోస్ట్ మార్టం రిపోర్ట్ తెరపైకి వచ్చింది. మాజీ స్పీకర్, మాజీ మంత్రి ఈ విషయంలో బీఆరెస్స్ పెద్దల కళ్లు తెరిపించే కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే… ఈ పోస్ట్ మార్టం ఏపీలో వైసీపీ, టీడీపీ అధినేతలకు చాలా మంచి పాఠం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బలకు ఆయింట్ మెంట్స్ రాసుకుంటూ.. మరోసారి దెబ్బ తగలకుండా లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటాలని బీఆరెస్స్ బ్రదర్ ఇన్ లాస్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా… జహీరాబాద్ పార్లమెంటు సమీక్షలో సీనియర్లు నిర్మొహమాటంగా అనేక అంశాలను ప్రస్తావించారు. నిండా మునిగాక చలి ఎందుకు అనుకున్నరో ఏమో చెప్పాలనుకున్న విషయాలు సూటిగా స్పష్టంగా చెప్పారని తెలుస్తుంది. దీంతో… ఇవే మాటలను పార్టీ పెద్దలు నాడే విని ఉంటే లెక్క మరోరకంగా ఉండేది కదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా… మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు సొంతనేతలే పార్టీని ఓడించినట్లు కుండబద్దలు కొట్టారు. అలా చేయడం ద్వితీయశ్రేణి నేతలు. కార్యకర్తల తప్పుకాదని చెప్పారు. కారణం… నాడు కొందరు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఆ విధంగా ఉండేదని.. ఇలాంటి వారిని గెలిపించి వాయించుకోవడం వేస్ట్ అనే నైరాశ్యంలో సొంత కేడరే బీఆరెస్స్ నేతలను కావాలని ఓడించారని పోచారం స్పష్టం చేశారని తెలుస్తుంది.
ఇదే సమయంలో పార్టీలో ఇప్పటికైనా పూర్తిస్ధాయి ప్రక్షాళన జరగాలని స్పష్టంగా చెప్పిన పోచారం… అలాకానిపక్షంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కష్టమే అని పరోక్షంగా హెచ్చరించారని అంటున్నారు. ఇదే సమయంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ… బీఆరెస్స్ సొంత తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓడిపోయిందని కుండబద్దలు కొట్టారని సమాచారం.
దీంతో… తాజాగా జరుగుతున్న బీఆరెస్స్ పోస్ట్ మార్టం ఏపీలో అధికార వైసీపీతో పాటు, విపక్షం టీడీపీకి కూడా చాలా ఉపయోగకరమైన పాఠంగా ఉందని అంటున్నారు. ఈ సమయంలో సిట్టింగుల విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును ఏపీలో జగన్ ఫాలో కాకపోవడం ప్లస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. పెర్ఫార్మెన్స్ బాగోకపోతే సారి చెప్పి పక్కన కూర్చోబెట్టడమే పార్టీకి మంచిదని అంటున్నారు.
ఇదే సమయంలో ఓంటెద్దు పోకడలు కూడా నష్టం చేస్తాయనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం యొక్క ప్రధాన్యతను గుర్తు చేస్తున్నారు. కారణం నిర్ణయాలు తీసుకోవడం సులువే కాని.. తాను తీసుకున్న నిర్ణయం సంబంధిత అభ్యర్థికి అర్ధమయ్యేలా నచ్చచెప్పడం కూడా ప్రధానమే. ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లు ఈ రెండు టాస్క్ లూ సక్రమంగా చేయగలిగితే దాని ఫలితంగా బాగుంటుంది.. అలాకానిపక్షంలో మొదటికే మోసం వస్తుంది!
ఇదే సమయంలో నిన్న బీఆరెస్స్ లో సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే విషయంలో తండ్రికి చెప్పే అవకాశం లేదు, కుమారుడు వినే పరిస్థితి లేదు అనే కామెంట్లు నేతల నుంచి ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తుండేవి! ప్రస్తుతం టీడీపీలో కూడా ఇలాంటి సౌండ్సే వినిపిస్తున్నాయి. తాజాగా కేశినేని నాని కుమార్తె శ్వేత చేసిన ఆరోపణలు, తీవ్ర విమర్శలు అదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అవతలి వ్యక్తి చెప్పే విషయం వినడం లోకేష్ కు ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం అని అంటున్నారు!
ఇలా లోక్ సభ ఎన్నికలకు సిద్ధపడుతున్న బీఆరెస్స్ కు సంబంధించిన తెరపైకి వస్తోన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ను ఏపీలో వైసీపీ, టీడీపీలు కూడా దృష్టిపెట్టి, పరిగణలోకి తీసుకోవాలని.. అలాకానిపక్షంలో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు!