టీడీపీకి నో ఛాన్స్… బీజేపీతో పొత్తుపై బొత్స కీలక వ్యాఖ్యలు!

ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. పైగా నిన్నమొన్నటి వరకూ టీడీపీ – జనసేనతో కలిసి ఏపీలో బీజేపీ ఎన్నికలకు వెళ్లబోతోందనే కథనాలు వెలువడ్డాయి. ఈ సమయంలో ఈ నెల 18న బీజేపీ తమ పాతమిత్రులతో భేటీ అవ్వబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీకి టీడీపీని ఆహ్వానించకపోవడతో వైసీపీ తో బీజేపీ స్నేహంపై కొత్త కథనాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో ఈ విషయాలపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును… వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జంపింగ్ లు, చేరికల పర్వాలు కూడా మొదలైపోయాయి. ఇక అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల గురించైతే ప్రత్యేకంగా చెప్పే పనేలేదు.

వీటికి తోడు ఎన్నికలు చేరువ అవుతున్న సమయంలో… కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంపై వరాల సునామీని కురిపిస్తోంది. పెండింగ్‌ లో ఉన్న వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తోంది.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇటీవలే హస్తినలో పర్యటించి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిల గురించి వారి వద్ద ప్రస్తావించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలుస్తుంది. దీంతో ముందస్తుకు జగన్ సిద్ధమవుతున్నారని.. బీజేపీతో జగన్ పొత్తులో పోటీ చేసే ఛాన్స్ ఉందని ఒక వర్గం కథనాలు వండి వడ్డించేస్తోంది.

దీంతో ఈ కథనాలు, ఊహాగాణాలపై ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ సీనియర్ నేత, విద్య్హాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాము సింగిల్ గానే పోటీ చేస్తామని బొత్స తేల్చి చెప్పారు. ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తుల కోసం పాకులాడుతాయంటూ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలపై వస్తోన్న కథనాలపై కూడా బొత్స క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండవని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇదే సమయంలో వ‌చ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు ఉంటాయనీ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ వివరించారు.