ఆలస్యం కాకుండా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: మంత్రి బొత్స

ముఖ్యమంత్రిని కోరుతున్నారా.? డిమాండ్ చేస్తున్నారా.? ప్రజల్ని మభ్యపెడుతున్నారా.? విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ తాజా వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్‌లో ఒకింత గందరగోళానికి కారణమవుతున్నాయి.

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయమై ఉత్తరాంధ్ర మంత్రులు గట్టిగా మాట్లాడుతున్నారు. అదే కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ విషయమై రాయలసీమ మంత్రులు అంత గట్టిగా గళం విప్పడంలేదు. అమరావతి గురించి అసలు వైసీపీ మంత్రులెవరూ మాట్లాడటంలేదు.. అది శాసన రాజధాని అని వైసీపీ భావిస్తున్నప్పటికీ.

ప్రధానంగా విశాఖ మీదనే వైసీపీ ఫోకస్ వుంది. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ అలాంటిది మరి. అయితే, న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యవహారం ఓ కొలిక్కి రావడంలేదు. గతంలో వైసీపీ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లుని ఆ వైసీపీ సర్కారే వెనక్కి తీసుకుంది. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఆ విషయమై అవగాహన లేదని ఎలా అనుకోగలం.?

ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు ఓ బహిరంగ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానిస్తూ డిమాండ్ చేసేశారు. ముఖ్యమంత్రి ప్రకటిస్తే సరిపోదు.. అసెంబ్లీలో చట్టం చేయాలి. దానికి న్యాయపరమైన చిక్కులున్నాయ్.

ఎలా.? ఈ గండం వైసీపీ ఎలా గట్టెక్కుతుంది.? గట్టెక్కడం కష్టమని తెలిసీ, బొత్స ఎవర్ని మభ్యపెడుతున్నట్లు.? అది వైసీపీకే బూమరాంగ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.!