ఆంధ్రప్రదేశ్‌లో 5 ఎంపీ సీట్లను టార్గెట్ చేసిన బీజేపీ.?

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు లోక్ సభ సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు వస్తాయనే ధీమాతో వుందట భారతీయ జనతా పార్టీ. అందులో తిరుపతి, విశాఖపట్నం తదితర సీట్లు వున్నాయట. అసలు ఇది సాధ్యమేనా.? అంటే, బీజేపీ నమ్మకం అలా వుంది మరి.!

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఖచ్చితంగా ఆ ఆరు సీట్లనూ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బీజేపీ వుందట. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. ఆ ఐదు సీట్లలోనూ తామే పోటీ చేస్తామనీ, దాంతోపాటుగా ఇంకో మూడు సీట్లు తమకు కేటాయించేలా టీడీపీపై ఒత్తిడి తెస్తామనీ బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

అసలెలా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి డిపాజిట్లు రావడమే కష్టం. అలాంటిది, లోక్ సభ సీట్ల మీద బీజేపీ ఎలా కన్నేస్తుంది.? అంటే, దానికి తమ వద్ద ఖచ్చితమైన వ్యూహాలు వున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ‘రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. మా జాతీయ నాయకత్వం ఈసారి మరింత కాన్ఫిడెంట్‌గా వుంది..’ అని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినా, అక్కడ పెద్దగా ప్రభావం చూపని విషయం విదితమే. ‘అది ఉప ఎన్నిక.. ఆ పరిస్థితులు వేరు.. అయినా, మేం గట్టిగా పోరాడాం.. ఈసారి గెలిచి తీరతాం..’ అని బీజేపీ చెబుతోంది. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చన్నది నిజమేగానీ, బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదన్నది మాత్రం నిర్వివాదాంశం.

మిత్రపక్షం జనసేనతోనే సరిగ్గా కలిసి నడవలేకపోతోందాయె.! టీడీపీతో పొత్తు విషయమై స్పష్టత ఇవ్వడంలేదాయె.! అసలు బీజేపీ నుంచి ఎంపీ క్యాండిడేట్లుగా బరిలోకి దిగినా, ఆ స్థాయిలో ఓటర్లపై ప్రభావం చపగల నాయకులెవరు.? ప్రశ్నలైతే వున్నాయ్.. సమాధానాలు మాత్రం దొరకవ్. అదే బీజేపీతో వచ్చిన తంటా.!