ఆ ఘనకార్యం వైసీపీ, టీడీపీలేనా.. మేము చేస్తామంటున్న బీజేపీ 

BJP preparing media ground in Andhrapradesh
వైసీపీ, టీడీపీ.. రెండు బద్ద విరుద్దమైన పార్టీలు.  విధివిధానాలు, పార్టీ నడిచే తీరు, నాయకుల లక్షణాల్లో రెండింటి మధ్య చాలా బేధం ఉంది.  కానీ ఒక్క అంశంలో మాత్రం రెంటికీ గట్టి పోలిక ఉంది.  అదే అనుంగ మీడియాను నడుపుకోవడం.  ఈ విధానానికి నాంధి పలికింది చంద్రబాబు నాయుడుగారే.  రెండు ప్రధాన పత్రికలను కుడి, ఎడమ భుజాలుగా పెట్టుకుని రాజకీయం చేశారు.  ఆ రెండు మీడియా సంస్థల్లో అనుకూల ప్రచారం, ప్రత్యర్థుల మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉనికిని చాటుకున్నారు.  ఆయన కనుసన్నల్లో నడిచే ఆ మీడియా సంస్థల చేతిలో ఇతర రాజకీయ పార్టీలు తల్లడిల్లిపోయిన సందర్భాలు అనేకం.  అందుకే వైఎస్ జగన్ సొంత మీడియాను స్థాపించుకున్నారు.  తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగానే పత్రిక, ఛానెల్ నెలకొల్పి బలమైన మీడియా వ్యవస్థను సృష్టించుకున్నారు.
ఆ ఘనకార్యం వైసీపీ, టీడీపీలేనా.. మేము చేస్తామంటున్న బీజేపీ 
ఆ ఘనకార్యం వైసీపీ, టీడీపీలేనా.. మేము చేస్తామంటున్న బీజేపీ
  
సొంతగా వైసీపీని స్థాపించాక ఆ మీడియా సంస్థ ఆయనకు ఎంతలా అక్కరకు వచ్చిందో అందరికీ విధితమే.  వైరి వర్గమైన చంద్రబాబు నాయుడు మీడియాను తట్టుకోవడంలో, తనపై జరుగుతున్న దుష్ట ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సొంత మీడియా ఆయనకు బాగా ఉపకరించింది.  ఇలా రెండు ప్రధాన పార్టీలు ఎవరి మీడియా వర్గాలతో వారు యుద్దం చేసుకుంటున్న రాజకీయ వాతావరణంలోకి మూడవ పార్టీ ప్రవేశించాలంటే అది కూడా సొంత లేదా తనకు పూర్తిగా సహకరించే ఛానెల్ లేదా పత్రికను చంకలో పెట్టుకుని దిగాల్సిన పరిస్థితి.  అసలు రాజకీయ పార్టీలను టచ్ చేయాలంటే ముందుగా వారికి కవచంలా ఉన్న మీడియాతో ఫైట్ చేయాలి.  లేకుంటే వాటి చేతిలో పడి తూట్లు తూట్లు కావలసిందే.  అలా కష్టాలు పడిన పార్టీ జనసేన.  ఎలాంటి మీడియా సపోర్ట్ లేకపోవడంతో రావాల్సిన గుర్తింపు రాలేదు.  పైగా ఒకవైపు నుండి పచ్చ మీడియా, ఇంకో వైపు నుండి బ్లూ మీడియా దాడికి పవన్ కళ్యాణ్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. పడుతూనే ఉన్నారు.  
 
ఈ పరిస్థితిని భారతీయ జనతా పార్టీ బాగా గమనించింది.  అందుకే ఏపీలో నిలదొక్కుకోవాలని అనుకుంటుండటంతో తన కోసం పనిచేసే మీడియా వర్గాన్ని ఏర్పాటుచేసుకునే పనిలో ఉన్నారు.  ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని రాజకీయ, మీడియా వర్గాల్లో హాట్ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.  ఇప్పటికే భారీగా కాకపోయినా ఒక మోస్తారు పాపులారిటీ ఉన్న ఛానెల్ ఒకటి అస్తమానం బీజేపీ భజన మొదలుపెట్టేసింది.  కొత్త అధ్యక్షుడి సారథ్యంలో కషాయ దళం కదంతొక్కుతోందని, కనబడని ఓటు బ్యాంకు ఆ పార్టీకి ఉందని, త్వరలో బీజేపీ సత్తా ఏమిటో తేలసొస్తుందని ప్రచారం స్టార్ట్ చేసింది.  రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుంది.  కేంద్రంలో ఉన్న బీజేపీకి మీడియాను వాడుకోవడం వెన్నతో పెట్టిన విద్య.  ఆ ప్రక్రియలోని విధివిధానాలన్నీ వారికి ఎరుకే.  ఆంధ్రాలో కూడ వాటిని కొనసాగిస్తారనడంలో సందేహమే లేదు.  సో.. ఇనాళ్లు మీడియా క్రీడలో టీడీపీ, వైసీపీలు మాత్రమే ఉండగా ఇక మీదట బీజేపీ కూడ చేరనుంది.