ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేంత సీన్ బీజేపీకి వుందా.?

మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో, భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఓ బాబాని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలన్నది బీజేపీ పన్నాగంగా పేర్ని నాని పేర్కొన్నారు. ఇంతకీ, రాష్ట్రంలో అలాంటి బాబా ఎవరున్నారు.? అసలు బీజేపీకి, ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేంత సీన్ వుందా.? అన్న ప్రశ్నలు హాట్ టాపిక్స్ అయ్యాయి రాష్ట్రంలో. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూల్చడం ప్రస్తుతం రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకీ సాధ్యం కాని పని. ఎందుకంటే, వైసీపీకి సొంతంగా 151 మంది ఎమ్మెల్యేలున్నారు. మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య 175.

అలాంటప్పుడు, వైసీపీకి ఎదురేముంది.? బీజేపీ గట్టిగా కష్టపడితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను లాగగలుగుతుందేమో. కానీ, వైసీపీకి ఇతర పార్టీలకు చెందిన ఓ అరడజనుకు పైగా ఎమ్మెల్యేల మద్దతుంది. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, వైసీపీ ఎంత అడ్డగోలు పాలన చేసినా, ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ వుండదు రానున్న రోజుల్లో. కానీ, సీనియర్ మంత్రి.. అందునా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ముఖ్యమంత్రి అదుపాజ్ఞల్లో వుండే పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి ఆలోచన కూడా వుండి వుండాలి. దీన్ని కేవలం డైవర్షన్ రాజకీయంగానే చూడాలి తప్ప, వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పట్లో కూలిపోతుందని విశ్లేషించడానికి వీల్లేని పరిస్థితి. బెయిల్ రద్దు కేసులు సహా ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పేర్ని నాని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఈ గేమ్ ప్లాన్ అమలు చేసి వుండాలి.