ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో జంపింగ్ లు ఎక్కువ అయిపోతున్నాయి. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి లోకి చేరి నేతలు కండువాలు కప్పేసుకుంటున్నారు. ఏ క్షణాన ఎవరు ఏ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారో అర్ధం కాని పరిస్థితి. అధికార పార్టీ నుండి వైసీపీ లోకి, వైసీపీ నుండి టీడీపీ లోకి ఇదే క్రమంలో జనసేనలోకి వలసలు మొదలయ్యాయి.
ఇప్పటికే అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, నేతలు జనసేనలో చేరుతున్న క్రమంలో టిడిపి సీనియర్ నేత జనసేనలోకి చేరనున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి త్వరలో జనసేన కండువా కప్పుకోనున్నారు. దీంతో అధికార టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఈ మేరకు జనసేన అధినేతను చదలవాడ కృష్ణమూర్తి హైద్రాబాదు పార్టీ ఆఫీసులో కలిశారు. పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. చదలవాడ విజయదశమినాడు పార్టీలో చేరనున్నట్టు సమాచారం.
చదలవాడ 1999 లో టిడిపి తరపున తిరుపతి నుండి పోటీ చేసి 15,000 ఓట్ల మెజారిటీ తో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015 ,ఏప్రిల్ 27 న టీటీడీ చైర్మైన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 27, 2017 న ఆయన పదవి విరమణ చేశారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న చదలవాడ జనసేనలో చేరనుండటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.