ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న పవన్ కల్యాణ్… జనసేన పార్టీ పదేళ్ల వార్షికోత్సవ వేడుకను ఇవాళ నిర్వహించనున్నారు. దీంతో ఈ సభను ఘనంగా నిర్వహించాలని నాయకులు.. బలంగా సక్సెస్ చేయాలని కార్యకర్తలు నిర్ణయించుకున్నారు.. తదనుగుణంగా పథకాలు రచించారు.. పనులు చేసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ పదేళ్ల ప్రస్థానంలో పవన్ సాధించిందేమిటి? ఏ లక్ష్యంతో జనసేనను ఏర్పాటు చేశారు? అసలు జనసేనకంటూ ఒక నిర్ధిష్టమైన లక్ష్యం ఉందా? ఈ పార్టీకి వెన్నెముఖ లాంటి కాపు సామాజికవర్గ ప్రజలపై పవన్ కి ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?…. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని చెబుతున్న పవన్ కు… ఈ పదేళ్ల ప్రస్థానం వేస్తున్న ప్రశ్నలు ఇవి!
అవును… 2014, మార్చిలో పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్, ఈ పదేళ్లలో సాధించిన పురోగతి? అని ప్రశ్నిస్తే… “శూన్యం” అనే సమాధానం వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే… జనసేన స్థాపించిన మొదలు జగన్ వ్యతిరేకతే ఎజెండాగా పవన్ కల్యాణ్ పని చేసుకుంటూ వచ్చారే తప్ప… తాను నమ్మిన – తనను నమ్మిన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించాలనే లక్ష్యంతో మాత్రం కాదని పవన్ పరోక్షంగా స్పష్టం చేసిన సందర్భాలెన్నో!
2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకపోవడం.. టీడీపీ-బీజేపీ కూటమిగా ఏర్పడితే, దానికి బేషరతుగా మద్దతు పలికి తన లక్ష్యం ఏంటో చెప్పకనే చెప్పడం చేశారు పవన్. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోవడంతో జనసేన ఆశయం నెరవేరిందని పవన్ కల్యాణ్ సంబరపడ్డారు. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించిన పవన్… జగన్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాననని ఓపెన్ గా చెప్పేశారు. దీంతో… పవన్ లక్ష్యం పై ప్రజలకు స్పష్టత రావడం మొదలైంది!
2019 ఎన్నికల ప్రచారంలో తిరుపతిలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివందనం చేసి, దళితులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన జనసేనాని… నాటి టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకఓటు చీలకుండా వామపక్షాలు, బీఎస్పీతో కలిసి కూటమి కట్టారు. ఈ లోపాయకారీ ఒప్పందంలో భాగంగా… లోకేశ్, చంద్రబాబు బరిలో నిలిచిన స్థానాల్లో పవన్ ప్రచారం చేయలేదు. తదనుగునంగా… పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారానికి వెళ్లలేదు. ఇది గ్రహించిన ప్రజలు ఇచ్చిన తీర్పు తెలిసిన విషయమే!
2024 ఎన్నికలు త్వరలో రాబోతుండటంతో… ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనంటూ పెద్దన్న పాత్ర పోషించాలని ఉబలాటపడుతున్నారు పవన్. మరోవైపు అధికారికంగా మిత్రపక్షమైన బీజేపీని – అనధికార మిత్రపక్షంగా చెప్పుకుంటున్న టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. అవి బెడిసి కొట్టాయి. మరోవైపు జనసేనతో పొత్తుపై టీడీపీ మౌనాన్ని తన బాషగా చేసుకుంది. జనసేనతో పొత్తు విషయమై ఎవరూ ఏమీ మాట్లాడొద్దని తమ పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో… ఈరోజు సాయంత్రం మచిలీపట్నంలో నిర్వహించనున్న వార్షికోత్సవ సభ ప్రాధాన్యం సంతరించుకుంది. గత పదేళ్లలో చంద్రబాబు పల్లకీ మోయడం, జగన్ ను వ్యతిరేకించడమే లక్ష్యంగా సాగింది. కనీసం రానున్న రోజుల్లోనైనా ఈ లక్ష్యం మార్చుకుంటారా? స్వతంత్ర రాజకీయం మొదలు పెట్టి కాపులతో పాటు తనను నమ్ముకున్న వారి ఆత్మాభిమానాన్ని కాపాడుతారా? లేక, ఈసారి కూడా కాపుల ఆత్మాభిమానాన్ని బాబు పాదాల దగ్గర త్ అన్నది వేచి చూడాలి!