మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీకి అంత లోకువైపోయారా.?

రఘురామకృష్ణరాజు తలనొప్పి ఓ వైపు.. ఆనం రామనారాయణరెడ్డితో తాళింపు ఇంకో వైపు.. ఇవిలా వుండగానే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పంచాయితీ.. ఇవన్నీ చాలదన్నట్టు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రచ్చ.. ఇంకా వున్నాయ్.! తాజాగా లిస్టులోకి కొడాలి నానికి అవమానమంటూ కొత్త రచ్చ.!

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీకి ఏమయ్యింది.? ‘వాడు ఏడో తరగతి ఫెయిల్.. విలన్‌గాడు కదా.. అందుకే, వాడికి యాక్సెస్ ఎక్కువ..’ అంటూ వైసీపీ నేతలు కొందరు మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ఎప్పటిది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, దీన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నది వైసీపీ మద్దతుదారులే కావడం గమనార్హం.

మంత్రి పదవి పోయినప్పటినుంచీ.. మరింత ఎక్కువగా వైసీపీ అధినాయకత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కొడాలి నాని. పోతే పోయింది పదవి.. నాకేంటి.? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారాయన. ముఖ్యమంత్రిని తూలనాడలేదు. పార్టీపైన ఎలాంటి విమర్శా చేయలేదు. కాకపోతే, మంత్రిగా వున్నప్పుడు పార్టీ పట్ల ఎంత విధేయుడిగా వున్నారో.. ఇప్పుడూ అంతే.!

ఇదే వైసీపీలో కొందరికి నచ్చడంలేదు. ‘కమ్మోడే కదా.. రెడ్డి పార్టీకి అండగా ఎందుకుంటాడు.? కొడాలి నానిని నమ్మితే, వైసీపీని నట్టేట్లో ముంచేస్తాడు.. ఎన్నికల సమయంలో..’ అంటూ కొందరు వైసీపీ నేతలే, కొడాలి నానికి వ్యతిరేకంగా రచ్చ మొదలెట్టారు.

కొడాలి నాని మాత్రమే కాదు, వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే తరహా రచ్చ వైసీపీలో జరుగుతుండడం గమనార్హం. నేతలిలా బాహాటంగా రచ్చ చేస్తున్నా వైసీపీ అధినాయకత్వం అలాంటివారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.