వైసీపీకి రాజీనామా చేయనున్న బాలినేని.? కానీ, ఎందుకు.!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయబోతున్నారట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాలి నేని శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు. అప్పట్లోనే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది.

అయితే, బాలినేనికి రీజినల్ కో-ఆర్డినేటర్‌గా అవకాశమిచ్చింది వైసీపీ అధినాయకత్వం. దాంతో ఆయన కాస్త మెత్తబడ్డారు. అయితే, ఆ పదవి వల్ల ఏమాత్రం లాభం లేకుండా పోయిందనీ, పార్టీలో తగిన గౌరవం లభించడంలేదనీ వాపోతున్నారు బాలినేని. వైసీపీ అధినాయకత్వం కూడా ఆయన్ని పట్టించుకోవడం మానేసింది.

ఈ క్రమంలో పార్టీ మారే దిశగా వ్యూహాలు పన్నుతున్నారు బాలినేని. అయితే, బాలినేని లాంటి సీనియర్ లీడర్ పార్టీని వీడితే నష్టమన్న భావనలో, వైసీపీ అధినాయకత్వం బెట్టు వీడింది. బాలినేనిని పిలిపించుకుంది. బాలినేనితో వైసీపీ అధినాయకత్వం చర్చలు ఫలిస్తే సరేసరి.. లేదంటే, ఆయన పార్టీ మారడం ఖాయమే.

‘బాలినేనిని బుజ్జగించడం దండగ. ఇప్పుడు కాకపోతే, ఆర్నెళ్ళ తర్వాత అయినా ఆయన వైసీపీని వీడతారు..’ అంటూ వైసీపీలో ఓ బలమైన వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలినేనిని బుజ్జగించడం వల్ల ప్రయోజనం లేదనే భావనకు వైసీపీ అధినాయకత్వం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇంతకీ, బాలినేని ఏ పార్టీలో చేరతారు.? జనసేనలోకి వెళ్ళే అవకాశం లేదు. బీజేపీలో చేరి, ఆ తర్వాత టీడీపీలోకి ఆయన రావొచ్చనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.