ఎటూ తేల్చుకోలేకపోతున్న మాజీ మంత్రి బాలినేని.!

మంత్రి పదవి దక్కనందుకు కొంత అసంతృప్తి వున్నా, పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని అంటున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మంత్రి వర్గ విస్తరణ సమయంలో తనకు కొనసాగింపు లభించకపోవడంపై బాలినేని కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆ తర్వాత ముఖ్యమంత్రి బుజ్జగింపులతో మెత్తబడ్డారాయన.

తాజాగా, పార్టీ శ్రేణులతో మాట్లాడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత రాజకీయాలపై కొంత అసహనం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి రాకపోతే, మన మీద రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడే అవకాశం వుంది. అరెస్టులు చేయిస్తాం.. అంటూ టీడీపీ, జనసేన హెచ్చరిస్తున్నాయ్.. పరిస్థితుల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి..’ అంటూ పార్టీ శ్రేణులకు సూచించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

బాలినేని వ్యాఖ్యలు వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడాయన వెలుగు వైసీపీలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.

ఓ దశలో బాలినేని, జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే, బాలినేని మాత్రం అంత రిస్క్ చేయలేదు. కక్ష సాధింపు చర్యలు రాజకీయాల్లో రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అధికారం గనుక వైసీపీకి దూరమైతే.. ఆ తర్వాత వ్యవహారం వేరేలా వుంటుందన్నది బహిరంగ రహస్యం.

గంటకో కేసు, పూటకో అరెస్టు.. అన్నట్లుగా ముందు ముందు పరిణామాలు వుండబోతున్నాయి. ఆ దిశగా టీడీపీ, జనసేన హెచ్చరికల్నీ చూస్తున్నాం. ఈలోగా చెయ్యాల్సిందంతా చేసెయ్యాలనే తొందరలో వైసీపీ కూడా వుందనుకోండి.. అది వేరే సంగతి.!

ఇంతకీ, బాలినేని సంగతేంటి.? పార్టీ మారే రిస్క్ చేస్తారా.? ప్రస్తుతానికైతే ఎటో తేల్చుకోలేకపోతున్నారుగానీ, గోడ మీద పిల్లి వాటం అయితే ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.