వైసీపీలో బాలినేని వివాదం సద్దుమణిగినట్టేనా.?

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మొత్తానికి మెత్తబడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలపై ముఖ్యమంత్రి వద్ద ఏకరువు పెట్టారట బాలినేని.

గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి సొంత పార్టీలో కొందరు నేతల తీరు పట్ల అసంతృప్తితో వున్నారు. ‘పిల్ల బచ్చాగాళ్ళు నా మీద పెత్తనం చేయాలని చూస్తున్నారు..’ అంటూ బాలినేని, సోకాల్డ్ వైసీపీ నేతలపై గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే.

‘నన్ను టార్గెట్ చేస్తున్నారు.. వివాదాల్లోకి లాగుతున్నారు..’ అంటూ కంటతడి పెట్టారు కూడా. బాలినేని పార్టీ మారడం ఖాయమని వైసీపీ శ్రేణులూ భావించాయి. కానీ, అంతలోనే బాలినేని ప్లేటు ఫిరాయించారు.

‘పార్టీలోని సమస్యల్ని పార్టీ అధినేతతోనే చర్చించి పరిష్కరించుకుంటాను..’ అని చెప్పారు బాలినేని కొన్నాళ్ళ క్రితం. దాంతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుజ్జగింపు చర్యలకు దిగారు. ఫలితంగా బాలినేని మరింత మెత్తబడ్డారు.

‘పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించబోను. పార్టీకి నష్టం కలిగించబోను. వైఎస్ జగన్ వెంటే వుంటాను..’ అని బాలినేని తాజాగా చెప్పుకొచ్చారు. ఈమాత్రందానికి ఇంత యాగీ ఎందుకు.?

ఇంతకీ, కొన్నాళ్ళ క్రితం టీడీపీ అధినేతతో బాలినేని మంతనాలు జరిపారన్న ప్రచారం సంగతేంటబ్బా.?