తెలుగుదేశం నాయకులందరి దృష్టీ ఇప్పుడు జగన్ పాలనపైనే ఉంది. అందరూ ఎప్పుడు విమర్శలు బాణాలు విసురుదామా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. మీడియా కూడా చాలా ఉత్సాహంగా వాటిని రికార్డ్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేకాదు వాళ్లను తమ ప్రశ్నలతో ఉసిగొల్పి..ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేయకపోతారా ..దానితో చెలరేగిపోదామా అన్నట్లు ఎదురుచూస్తోంది. ఈ నేపధ్యంలో తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దొరికితే మీడియా ఊరుకుంటుందా. వైయస్ జగన్ గురించి అడిగేసింది.
అసెంబ్లీ ఆవరణలో మీడియాతో బాలయ్య మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేసింది తెదేపా ప్రభుత్వమేనని చెప్పారు. ఆ తర్వాత యధావిధిగా…15రోజుల జగన్ పాలనపై అభిప్రాయం కోరగా.. మరి కొంతకాలం చూద్దామని అన్నారు. అంతేకానీ మీడియా వాళ్లు ఎంత చెప్పిద్దామని ట్రై చేసినా వాళ్ల వల్ల కాలేదు. అలాగే తెదేపా ఎమ్మెల్యేలు ప్రజలకు బంట్రోతులని.. వైకాపా నేతల్లా కాదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
ఇక ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బాలకృష్ణ పెదవి విరిచారు. ప్రతిష్ఠాత్మక అమరావతి రాజధాని నిర్మాణం గురించి ప్రసంగంలో చెప్పలేదని.. బీసీల సంక్షేమం గురించి ఎక్కడా గవర్నర్ ప్రస్తావించలేదని విమర్శించారు.