వైసిపి అధినేత జగన్ పై దాడి, హత్యాయత్నం

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. విశాఖ ఎయిర్ పోర్టులోని వెయిటింగ్ లాంజ్ లో జగన్ కూర్చొని ఉండగా ఈ దాడి జరిగింది. వివరాలివి.

ప్రజాసంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న జగన్ శుక్రవారం  సిబిఐ కోర్టుకు హాజరయేందుకు హైదరాబాద్ బయలు దేశారు.  విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఇండిగో విమానం హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. విమానాశ్రయంలో లాంజ్ లో ఉన్నారు. ఎయిర్ పోర్టు క్యాంటీన్ లో పనిచేసే  కొంతమంది వెయిటర్స్ జగన్మోహన్ రెడ్డి వెయిటింగ్ లాంజ్ లో కూర్చున్న సమయంలో సెల్ఫీ దిగేందుకు వచ్చారు.

తర్వాత పక్కనే ఉన్న వాష్రూమ్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ లో పనిచేస్తున్న శ్రీనివాసరావు  అనే వ్యక్తి  ఈసారి ‘160 సీట్లు వస్తాయి సార్’ అంటూ పలకరించాడు. సెల్ఫీ తీసుకుంటానని జగన్ కోరాడు. జగన్ చిరునవ్వుతో అంగీకరించాడు. సెల్ఫీ తీసుకుంటూ పందెం కోళ్ళకు కట్టే కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. మొదట కడుపులో పొడవడానికి ప్రయత్నించాడు. ఏం జరుగుతున్నదో తెలుసుకున్న  జగన్  చేయి అడ్డం పెట్టాడు. దీంతో జగన్  చేతికి భుజానికి గాయాలయ్యాయి. వెంటనే జగన్ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వెయిటర్ శ్రీనివాసరావును పోలీసులకు అప్పగించారు.

 

ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసు సిబ్బంది

దాడి సమయంలో బాగా రక్తం కారింది. రక్తపు మరకలు ఎయిర్ పోర్ట్ వెయిటింగ్ లాంజ్ లో కనిపించాయి. దాడి తర్వాత జగన్ ను సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఎయిర్ పోర్ట్ డిస్పెన్సరీ కి తరలించారు. ఆ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత వెంటనే జగన్ హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. జగన్ మీద దాడి ఘటనపై వైసిపి వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

 

 

అసలు జగన్ మీద దాడి చేయాలన్నంత పగ వెయిటర్ శ్రీనివాస్ కు ఎందుకు కలిగింది? ఈ దాడి ఘటనలో దాడికి దిగిన శ్రీనివాసరావు పూర్వాపరాలేంటి? ఉద్దేశపూర్వకంగా దాడికి దిగాడా? లేక వేరే కారణాలున్నాయా? అన్నదానిపై ఆంధ్రా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలవరం రేపింది.

కేబినెట్ ర్యాంకులో ఉన్న ఒక ప్రతిపక్ష నేతపై విమానాశ్రయంలో ఇంత సులువుగా దాడి జరగడంపై అనేక అనుమానాలు రేగుతున్నాయి.  ఎయిర్ పోర్టులో ఫస్టు ఎయిడ్ చేయించుకుని జగన్ హైదరాబాద్ బయల్దేరారు. పోలీసులు దాడి చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

 

జగన్ భుజం మీద పోర్క కుచ్చుకోవడంతో రక్త గాయం
జగన్ పై దాడికి ఉపయోగించిన కత్తి ఇదే

 

జగన్ తో పాటు ఎయిర్ పోర్టులో మరికొంత మంది నేతలున్నారు. అసలు అంతా చూస్తుండగానే ఎవరూ ఊహించని రీతిలో ఒక్క సారిగా దాడి జరగడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంత వరకు కాఫీ తాగి నవ్వుతూ ఉన్న జగన్  ప్రమాదానికి గురి కావడంతో వైసిపి నేతలు షాక్ తిన్నారు. ఫోటో తీసుకుంటానని వచ్చి దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలోవారికి అర్థం కాలేదు. 

జగన్ పై దాడిని వైసిపి నేతలు ఖండించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని వారు దుయ్యబట్టారు. ఎయిర్ పోర్టులో కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటి ఉంటుందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై జరిగిన దాడిని ప్రభుత్వ దాడి అని వైసీపి నేత రోజా  అన్నారు. ప్రతిపక్ష నేతకు కనీసం భద్రత కల్పించకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి ఈ దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలన్నారు. జగన్ జనాభిమానాన్ని చూసి  ఓర్వలేక చేసిన దాడి అన్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్నా కూడా భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 

 

జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అల్లరి మూకలు దాడులు జరిపే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. అసలు ఆ యువకుడు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే దాని పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్ పోెర్టులో కేబినేట్ స్థాయి నేత పై దాడి జరగడంతో భద్రతా లోపాలపై సమీక్ష నిర్వహించే పనిలో అధికారులున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రోడ్లెక్కి నిరసన తెలిపారు.

దాడికి పాల్పడిన శ్రీనివాసరావును తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ పై జరిగిన దాడికి ఉపయోగించిన కత్తికి విషపు పూత పూసి ఉంటారని పలువురు వైసిపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మీద దాడికి సంబంధించిన వీడియోలు పైన ఉన్నాయి.