ఏపీలో హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధం, దుర్గగుడిలో సింహాల ప్రతిమల చోరీ, రామతీర్థంలో విగ్రహం ధ్వంసం ఘటనలు మరవక ముందే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రిలోని శ్రీరామ నగర్లోని విఘ్నేశ్వరాలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంపై అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు.
స్వామి వారి విగ్రహానికి ఉన్న రెండుచేతులను విరగ్గొట్టారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన పూజారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని గమనించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఆలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఎవరైనా మద్యం మత్తులో ఇలా చేశారా లేక విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు కావాలనే విగ్రహాన్ని ధ్వంసం చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహాల ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిన 24గంటల్లోనే మరో ఆలయంపై దాడి జరగడం కలకలం రేపుతోంది. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు దారుణమని అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం జగన్ అన్నారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడన్నారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.