2024 ఎన్నికల ఫలితాలు: టీడీపీ-160.. వైసీపీ-15.. జనసేన-0?

మహానాడు వేదికగా జరగబోయే ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై క్లారిటీ ఇచ్చారు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు. తనదైన వాక్ చాతుర్యంతో ప్రసంగించిన ఆయన… రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు కన్ ఫాం అని తేల్చి చెప్పేశారు. ఇలా ఇప్పుడు అచ్చెన్న చెప్పిన లెక్కల వివరాలతో జనసేన కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారంట. పైగా ఈ మహానాడును టీవీలో చూస్తున్న జనసైనికులు… తమ ప్రస్థావన రాకపోతుందా అని ఆశగా ఉన్నారు. కానీ… ఇలాంటి ప్రస్థావన వస్తుందని ఊహించలేదని తెలుస్తుంది!

మహానాడు వేదికపై టీడీపీ ఏపీ చీఫ్ హోదాలో మైకందుకున్న అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ… వ‌చ్చే ఎన్నిక‌ల్లో 160 స్థానాల‌ను టీడీపీ గెలుచుకోవ‌డం ఖాయ‌మ‌న్నారు. 2019 ఎన్నికల సమయంలో నాడు చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోలేకపోవ‌డం వ‌ల్లే ఓడిపోయామ‌ని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అయితే 2014-19 సమయంలో చంద్రబాబు చేసిన అద్భుతమైన పాలనను ఈసారి కచ్చితంగా ప్రజలకు చెప్పాలని, తద్వారా ఆ గోల్డెన్ డేస్ ని జనాలకు మరోసారి గుర్తుచేయాలని పరోక్షంగా కార్యకర్తలకు సూచించారు అచ్చెన్నాయుడు!

అయితే… మహానాడు లాంటి కీలకమైన వేదిక‌పై పొత్తుల గురించి మాట మాత్రమైనా అచ్చెన్నాయుడు ప్రస్థావించకపోవడం ఇప్పుడు జనసైనికుల్లో హాట్ టాపిక్ గా మారింది. అధినేత బిజీగా ఉండటం వల్లో ఏమో కానీ.. అచ్చెన్న కామెంట్స్ పై తెగ ఫీలయిపోతున్నారట జనసైనికులు. కేవ‌లం 15 సీట్లలో మాత్రమే వైసీపీ గెలుస్తుంద‌ని కూడా పరోక్షంగా చెప్పారు అచ్చెన్న! దీంతో గోదావరి జిల్లాల్లోని జనసైనికులు కారాలూ మిరియాలూ నూరడం మొదలుపెట్టారు. జనసేన అంటే ఇప్పటికీ టీడీపీ నేతలకు చులకనభావం పోలేదని ఆవేదన చెందుతున్నారు. టీడీపీ – జనసేనలు కలిసి 160 స్థానాలు గెలుస్తాయని చెబితే అచ్చెన్న సొమ్మేమైనా పోతుందా అంటూ ఫైరవుతున్నారు.

ఇలా మహానాడు మొదటిరోజు జనసేనపై స్పష్టత ఇచ్చారు అచ్చెన్నాయుడు. అయినా కూడా ఈ విషయాలను పవన్ ఏమీ సీరియస్ గా తీసుకోరనే విషయం తెలియడం వల్లే అచ్చెన్న ఈటైపు కామెంట్లు చేశారని అంటున్నారు. ఏది ఏమైనా… రాజకీయాల్లో జనసేనను టీడీపీ ఎప్పుడూ ఆటలో అరటిపండులానే చూస్తుందన్న విషయం పవన్ ఎప్పటికి గ్రహిస్తారో అనే కామెంట్లు గోదావరి జిల్లాల్లో బలంగా వినిపిస్తుండటం కొసమెరుపు! అయితే.. ఎంపీ స్థానలపై మాత్రం అచ్చెన్న క్లారిటీ ఇవ్వలేదు!