ఏపీ రాష్ట్ర ఊహించని విధంగా ఇప్పుడు ప్రభుత్వం చేతిలో చిక్కారు. నిమ్మగడ్డ దూకుడుతో వెళ్లి నిబంధనలను పట్టించుకోలేదు. హైకోర్టు కూడా దీనికి అభ్యంతరం తెలపడంతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ – వాచ్ యాప్ ప్రయివేటు వ్యక్తులు తయారు చేశారని, దీనికి ప్రభుత్వం ఆమోదం కూడా పొందలేదని ప్రభుత్వం వాదిస్తుంది.
హైకోర్టు సయితం భద్రతా పరమైన అనుమతులు లేకుండా ఈ యాప్ ను వినియోగించవద్దని సూచించింది. భద్రతపరమైన అనుమతులు వచ్చిన తర్వాతనే వినియోగించాలని ఆదేశించింది. ఈ నెల 9వ తేదీన ఈ యాప్ అంశంపై విచారణకు వాయిదా వేసింది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపున రూపొందించిన యాప్ ను అత్యంత గోప్యంగా ఉంచారు. ఏదైనా యాప్ ను ఆవిష్కరించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
ప్రభుత్వ సాంకేతిక శాఖ నుంచి ఈ అనుమతులను ఎవరైనా పొందాల్సి ఉంటుంది. యాప్ కోసం ప్రభుత్వం నుంచి ఐదు రకాల అనుమతులను పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ అనుమతులేవీ తీసుకోకుండానే యాప్ ను ఆవిష్కరించారు. హైకోర్టు ఆదేశాల తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ యాప్ సర్వర్ కూడా ప్రయివేటు వ్యక్తులు నిర్వహిస్తుండటాన్ని ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన సీ విజిల్ యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ కూడా ఉంది. అయితే వీటిని వేటిని ఉపయోగించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా యాప్ ను తయారు చేయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం దీనికి అనుమతులు ఇవ్వడం కష్టమేనంటున్నారు