హైకోర్టులో జగన్ కేసు: ఇరు వర్గాల వాదనలు ఇవే

వైజాగ్ ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన విచారణలో తమకు ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆయన బాబాయి వైవి సుబ్బారెడ్డి కూడా ఈ ఘటనపై వేర్వేరు పిటిషన్లు వేశారు. అంతేకాదు ఎయిర్పోర్టులో భద్రతపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని అనిల్ కుమార్ ప్రజాహిత వ్యాజ్యం వేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ విచారణకు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన ధర్మాసనం ముందు వారి వాదనను వినిపించారు. దాడి ఘటనపై దర్యాప్తునకు జగన్ సహకరించట్లేదని ఆయనహైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గాయపడిన సమయంలో జగన్ ధరించిన రక్తపు మారకాలున్న చొక్కా ఇంతవరకు దర్యాప్తు అధికారులకు ఇవ్వలేదని తెలిపారు. సిఆర్పీసీ 160 సెక్షన్ కింద స్టేట్మెంట్ ఇవ్వడానికి అభ్యంతరం తెలిపారని తెలియజేసారు. ఆయన వివరాలు వెల్లడించిన తరువాత ఇరువైపుల న్యాయవాదులు మధ్య వాదనలు మొదలయ్యాయి.

వైసీపీ తరపు న్యాయవాదులు వారి వాదనలు ఇలా వినిపించారు. జగన్ పై దాడి ఘటన చిన్నదిగా పేర్కొంటూ డీజీపీ మీడియాకు తెలిపారు. ఆ తర్వాత వైసీపీ కార్యకర్తే సానుభూతి కోసం దాడి చేసినట్లు సీఎం ప్రకటించారు. ఘటనపై విచారణ జరపకముందే వారు చేసిన ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తుపై నమ్మకం పోయిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు దేశాయ్ ప్రకాష్ రెడ్డి, సీవీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

అయితే బాధితుడి స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాక, ఇంక ప్రజాహిత వ్యాజ్యం ఎందుకని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. దర్యాప్తు తీరుపై శుక్రవారం షీల్డ్ కవర్ లో సిట్ నివేదిక అందజేయాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసారు. కాగా నివేదికను విశాఖ నుండి తేవలసి ఉన్నందున సోమవారం లేదా మంగళవారం అందజేయగలమని ఆయన విన్నవించుకున్నారు. తదుపరి విచారణ ఈరోజు (శుక్రవారం) జరగనుంది.