వ్యక్తిగత విషయాలు అవసరమా జగన్.. ఆంధ్రప్రదేశ్ పరువు పోతుందిగా?

YS-Jagan-Mohan-Reddy-4

ఏపీలో ఇప్పుడు కొత్త రకం సర్వే జరుగుతోంది. ప్రతి ఇంటిలో ఎంత మందికి వివాహేతర సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే సర్వే ఇది. ఇలాంటి సర్వే జరగడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎంత మందికి వివాహేతర బంధాలున్నాయని, ఎంత మందితో అలాంటి సంబంధాలు పెట్టుకున్నారని అడుగుతున్నారు. ఇలా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆరా తీయడంతో ప్రజలు షాక్ అవుతున్నారు.

సచివాలయంలో ఉండే మహిళా పోలీసులకు, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఈ బాధ్యతలను కట్టబెట్టడం ఆశ్చర్యకర విషయం అనే చెప్పాలి. అధికారులు వాలంటీర్లను తీసుకుని ప్రతి ఇంటికీ వెళ్తూ వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలు, వీటికి సంబంధించిన నేరాలు వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ ఓ ప్రత్యేక ప్రోఫార్మాలో తీసుకుని సేకరిస్తున్నారు.

సాధారణంగా అయితే ఇలాంటి వివరాలు అడిగినప్పుడు చాలా మంది తీవ్రంగా ఫైర్ అవుతుంటారు. అయినా కూడా వాలంటీర్లు ప్రోఫార్మా ప్రకారం వివరాలు రాసుకుని పోలీస్ స్టేషన్లలో ఇస్తున్నారు. నిజానికి ప్రజల వ్యక్తిగత సమాచారం అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ల వంటివి వస్తాయి. కానీ సర్కారు మాత్రం ప్రజల పర్సనల్ వివరాలు సేకరించడం పలువురిని షాక్ కు గురి చేస్తోంది.

ఆఖరికి లైంగిక సంబంధాల వివరాలు కూడా వాలంటీర్లు సేకరిస్తున్నారు. దీంతో వాలంటీర్లు, మహిళా పోలీసుల తీరుపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సమాచారాన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. గ్రామ మహిళా పోలీసులు, వాలంటీర్లకు అలాంటి వివరాలు ఎవరూ చెప్పకపోయినా వారికి తెలిసిన సమాచారం ప్రకారంగా రాసేస్తున్నారు. ఇలాంటివి అనేక వివాదాలకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి వ్యక్తిగత విషయాలను తీసుకోవడం తప్పు అయినా సర్కార్ దీనిని ఎలా చేస్తోందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.