ఏపి ఖజానా ఖాళీ..అప్పులూ పుట్టటం లేదు

చంద్రబాబునాయుడు  పరిపాలనా దక్షత  వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. పోయిన ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చిన చంద్రబాబు వాటి అమలుకు అందినచోటల్లా అప్పులు తెచ్చారు. పోనీ హామీలన్నా సంపూర్ణంగా నెరవేరిందా అంటే అదీ లేదు. మరి రాష్ట్ర ఆదాయం, తెచ్చిన అప్పులు ఏమయ్యాయంటే కాకెత్తుకుపోయిందనే చెప్పాలి.

అనవసర ప్రాజెక్టులను తలకెత్తుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా పట్టిసీమ ప్రాజెక్టు అలాంటిదే. తనవాళ్ళకు కాంట్రాక్టు పనులను కట్టబెట్టేందుకు కొత్త ప్రాజెక్టులను ఎత్తుకోవటమే కాకుండా ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల అంచనా వ్యయాలను కూడా విపరీతంగా పెంచేశారు. ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది.

చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఖజానా ఖాళీ అవటంతో ఉద్యోగులకు మే నెలలలో చెల్లించాల్సిన ఏప్రిల్ జీతాలకు కూడా డబ్బులు లేవు. ఎక్కడ అప్పు దొరికితే అక్కడ, ఎవరెంత వడ్డీ చెప్పినా కాదనకుండా అందినకాడికి అప్పులు తేవటంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ మొత్తం కుదేలైపోయిందని నిపుణులు మొత్తుకుంటున్నారు.

రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుండి నిధుల్లో అత్యధికాన్ని కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకే సర్దేశారు. దాంతో ఇతర రంగాలకు డబ్బులు లేకుండా పోయాయి. ఒక్క నెలలోనే ప్రభుత్వం రూ 5 వేల కోట్లు అప్పులు తెచ్చింది. మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఖాజానా వాస్తవ పరిస్ధితిని చూస్తుంటే రేపు పొరపాటున టిడిపి కాకుండా ఇంకే పార్టీ అయినా అధికారంలోకి వస్తే అంతే సంగతులు.