ఎన్నికల సందడి మొదలైందంటే… తదనుగుణంగా మిగిలినవాటితో పాటు సర్వేల సందడి కూడా మొదలవుతుంటుంది. రకరకాల సర్వేలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో భాగంగా తాజాగా ఆరు జిల్లాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో బీజేపీ రహిత టీడీపీ-జనసేన కూటమిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఆరు జిల్లాల్లోనూ 51 నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయలను సేకరించినట్లు వెల్లడించారు!
ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై అధికార వైసీపీ పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. గతంలో ఎన్నడూ లేనంత అన్నట్లుగా అభ్యర్థుల ఎంపికలో పలు మార్పులు చేపట్టింది. కీలక నియోజకవర్గాల్లో కీలక నేతలకు సైతం స్థాన చలనం కలిగిస్తుంది. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అనే తారతమ్యాలేవీ లేవన్నట్లుగా ముందుకుపోతుంది.
ఇదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోపక్క సీట్ల సర్ధుబాటులో భాగంగా త్యాగాలు చేయాల్సిన తమ్ముళ్ల అసంతృప్తిని పోగొట్టడానికి ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. పైగా… గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు కూడా జనసేనకు ఇవ్వాల్సి రావడంతో ఈ అసంతృప్తి ఏ స్థాయిలో ఉండబోతుందనేది అభ్యర్థుల ఎంపిక తర్వాత బయటపడే అవకాశం ఉంది.
ఈ సమయంలో తాజాగా తాజాగా ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థా దాస్.. ఏపీ ఎన్నికలపై ఆరు జిల్లాల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా ఆ ఫలితాలను వెల్లడించారు. ఇదే సమయంలో… 7,500 మంది ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ ఇది అని.. ఆరు జిల్లాల్లో ఈ సర్వే కొనసాగిందని.. ఆయా జిల్లాల్లోని 51 నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించామని తెలిపారు.
ఇందులో భాగంగా… తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో ఈ సర్వే చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ ఆరు జిల్లాలోని సుమారు 51 నియోజకవర్గాల్లో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందనే విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా… ఈ 51 నియోజకవర్గాల్లోనూ 31 స్థానాల్లో అధికార వైసీపీ ఆధిక్యతలో నిలవగా.. మిగిలిన 20 చోట్ల టీడీపీ- జనసేన పైచేయి సాధించిందని తెలిపారు.
ఇదే సమయంలో… టీడీపీ – జనసేన కూటమిలో ప్రస్తుతానికి భారతీయ జనతాపార్టీని పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించారు. టీడీపీ- జనసేన అభ్యర్థుల జాబితా వెలువడిన అనంతరం మరోసారి ప్రజల మనోగతాన్ని తెలుసుకుంటామని పార్థా దాస్ తెలిపారు.