పాలక పక్షం, ప్రతిపక్షం మధ్యన రాజకీయం రోజురోజూకూ వేడేక్కుతోంది. అవకాశం దొరికితే ఒకరినొకరు ఇరికించేసుకోవాలను తెగ ఉబలాటపడిపోతున్నారు. నాయకుల తీరే ఇలా ఉంటే ఇరు పార్టీల శ్రేణులు కూడ ఇదే తరహాలో ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలకు దిగడం, నిరసనలు, మాటల యుద్దాలు, వీలైతే ముష్టిఘాతాలు. వీరి మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారు. అధికారంలో ఎవరంటే వారు పోలీసుల మీద పెత్తనం చెలాయించడం ఆనవాయితీ అయిపోయిన ఈ రాజకీయాల్లో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీ ఏమో పోలీసులను బెదరగొడుతుంటే ప్రతిపక్షం ఏమో పాలకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తుంటారు. ఈమధ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ విధానానికి ఇంకో కొత్త అంశాన్ని జోడించారు.
పోలీసులను వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారం ఆడుకుంటున్నారనే ప్రచారం స్టార్ట్ చేశారు. అధికారంలో ఉన్నామనే దర్పంతో పోలీసుల మీదే దాడులకు దిగుతున్నారని అన్నారు. తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాటలో సీఐ ఆటో మీద పడటం అయన తలకు దెబ్బ తాకడం జరిగింది. దీన్ని చూపిస్తూ వైసీపీ గూండాలు పోలీసుల మీద దాడి చేస్తున్నారని, రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్థాయి నేత ఇలా పోలీసుల మీద దాడులు జరుగుతున్నాయని అనడం పెద్ద విషయమే.
దీంతో స్పందించిన పోలీస్ శాఖ ఫ్యాక్ట్ చెక్ అంటూ అక్కడ పోలీసుల మీద దాడి వైసీపీ కార్యకర్తలు దాడి చేయలేదని, పోలీస్ పడిపోయి ఆయన కు దెబ్బ తగిలితే వైసీపీ వాళ్ళు సపర్యలు చేశారని వివరణ ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబుగారు మీ పోస్ట్ కరెక్ట్ కాదు. మీ ఆరోపణలు తప్పు. అవి ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని అన్నారు. ఇక టీడీపీ శ్రేణులు ఈ వివరణ మీద ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చాయి. ఇంకోవైపు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైతం పోలీసులను వైసీపీ నేతలు ఎలా తిట్టారో వీడియోలు వేసి వివరించారు. ఆ వీడియోల్లో గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి బొంగులో పోలీసులు అందం, ఆమంచి ఇంకేదో అనడం ఉన్నాయి.
అంతేకాదు ప్రతిపక్ష నాయకుల ట్వీట్లకి వాస్తవాలు తెలుసుకోకుండా స్పందించే ఏపీ పోలీసులు ట్విట్టర్ ఖాతాల్లో వైకాపా నాయకుల నోటి దూలని చూసి కూడా స్పందించరా లేదా అధికార పార్టీ నాయకులైతే పోలీసులను తన్నోచ్చు, బూతులు తిట్టొచ్చు అనే జగన్ గారు కొత్త చట్టం తెచ్చారా అంటూ విమర్శలు గుప్పించారు. మొత్తానికి రాజకీయ పార్టీల, శ్రేణుల అత్యుత్సాహం వలన పోలీసులు తమను ఎవరూ కొట్టలేదు తిట్టలేదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.