హైదరాబాద్ తరువాత అతి పెద్ద మెగా సిటీ విశాఖ మాత్రమే. రోడ్, రైల్, ఎయిర్, సీ కనెక్టివిటీ ఉన్న విశాఖలో కొలువు చేయడం అంటే ఎవరైనా ఇట్టే గంతేస్తారు. జగన్ కూడా ఇలాంటి వీక్ నెస్ గమనించే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నారు అంటారు. మూడు రాజధానుల విషయంలో చట్టం అయి నాలుగు నెలలు అయినా కూడా న్యాయపరమైన వివాదంలో అది చిక్కుకోవడంతో విశాఖకు రాజధాని రాక ఆలస్యం అవుతోంది.ఇదిలా ఉంటే విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం సిద్ధపడితే తాము కూడా సహకరిస్తామని ఏపీ ఎన్జీవోలు గట్టిగా చెబుతున్నారు. తాము ప్రభుత్వం ఎపుడు రమ్మంటే అపుడు విశాఖకు రావడానికి రెడీ అని కూడా నమ్మకంగా భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం పాలనా పరమైన వికేంద్రీకరణకు తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తామని సంఘం ప్రెసిడెంట్ చంద్రశేఖరరెడ్డి చెబుతున్నారు. ఏపీలో ఉద్యోగులు ప్రజల కోసం ప్రభుత్వాలు తీసుకునే మంచి నిర్ణయాలకు ఎపుడూ అండగా ఉంటారని కూడా ఆయన అంటున్నారు.
ఇక విశాఖ అధికారికంగా రాజధాని అని ప్రకటించకపోయినా జగన్ మాత్రం ప్రతీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విశాఖలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యాచరణను కూడా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మెట్రో రీజనల్ ఆఫీస్ ని విశాఖకు తరలించిన జగన్ సర్కార్ మార్చిలో టెండర్లు పిలిచి మెట్రో రైలు పనులను చేపట్టడానికి సిద్ధపడుతోంది. 14 కోట్లలో మెట్రో రైలు పనులు మొదటి దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే డిసెంబర్ నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఇక విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీకి కూడా తాజాగా పచ్చ జెండా ఊపేశారు.
ఇక కొత్త ఏడాది మీదనే వైసీపీ కోటి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో కోర్టులో రోజు వారీ విచారణ జరుగుతోంది. ఇక్కడ తీర్పు కనుక అనుకూలంగా వస్తే మాత్రం మరుక్షణం విశాఖకు పరుగులు తీయడానికి రెడీ అవుతోంది. దానికి సంబంధించిన కసరత్తు అంతా తెర వెనక వేగంగా జరుగుతోంది. విశాఖలో ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి అందుబాటులో ఉంచుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఉగాదికి విశాఖకు రాజధానికి శంఖుస్థాపన చేయలని జగన్ అనుకున్నారు. అన్నీ కలసి వస్తే వచ్చే ఏడాది ఉగాదికి ఆ కార్యక్రమం పూర్తి చేస్తారని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.