పవన్ కళ్యాణ్‌ని దారుణంగా టార్గెట్ చేసిన మంత్రి అమర్‌నాథ్.!

రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారన్నది ప్రజలు వింటూనే వుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నామధ్య ‘చెప్పు చూపించి’ అధికార పార్టీ నాయకులు తిట్టిన వైనం అప్పట్లో పెను సంచలనం. అయితే, ఆ వ్యవహారం వల్ల పవన్ కళ్యాణ్‌కి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే, ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. కానీ, అధికార వైసీపీ పరిస్థితి అది కాదు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి, 2024 ఎన్నికల్లో 175 సీట్లు సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. పవన్ కళ్యాణ్‌ని వైసీపీ మంత్రులు టార్గెట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్‌కి నష్టం లేదు సరికదా, లాభమే ఎక్కువ. అదే సమయంలో, వైసీపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం వుంది.

పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా సముద్రం ఒడ్డున విహరించారు. అది కూడా, మత్స్యకారుల సమస్యల్ని తెలుసుకునేందుకు.. మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, వారి సమస్యల్ని విన్నారు. మత్స్యకారులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ కళ్యాణ్‌కి వివరించారు, తాము పడుతున్న ఇబ్బందుల్ని చెప్పుకుని వాపోయారు కూడా. అంటే, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టం మత్స్యకారుల విషయంలో. మత్స్యకార భరోసా.. అంటూ వైసీపీ సర్కారు, ‘బటన్ నొక్కి’ నిధులు విడుదల చేయడం అనేది జరుగుతూనే వుంది. కానీ, అవి తమకు ఏమాత్రం సరిపోవడంలేదనీ, వాటిని చూపిస్తూ.. తమకు దక్కాల్సిన ముఖ్యమైన అంశాల్ని పక్కన పెట్టేశారని అంటున్నారు మత్స్యకారులు.

సమస్య ఇంత తీవ్రంగా వుంటే, బీచ్ ఒడ్డున ప్రేమపక్షుల్లా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ విహరించారనీ, కలిసి తింటారు, కలిసి పడుకుంటారని మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు.? ఈ వ్యాఖ్యలు వైసీపీ స్థాయిని దిగజార్చేస్తాయి.