చంద్రబాబు ఖేల్ ఖతం.! షాకిచ్చిన హైకోర్టు.!

ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కేసులకు సంబంధించి చంద్రబాబుకి షాక్ తగిలింది.. అదీ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో.! టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాదాపు నెల రోజుల క్రితం అరెస్టయిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో క్వాష్ కోసం చంద్రబాబు కోర్టును ఆశ్రయించగా, పదే పదే చుక్కెదురవుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ విషయమై విచారణ జరుగుతోంది. ఇంకోపక్క, చంద్రబాబు మీద పలు ఇతర కేసులూ బనాయించబడ్డాయి. రాజధాని అమరావతికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరుతో కుంభకోణమనీ, ఫైబర్ గ్రిడ్ అనీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్ళులో జరిగిన దాడుల వ్యవహారం అనీ.. ఈ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మూడు కేసుల్లోనూ చంద్రబాబుకి చుక్కెదురయ్యింది. దాంతో, ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకి ఊరట లభించినా, పై మూడు కేసుల్లో ఏదో ఒక కేసులో చంద్రబాబు అరెస్టయి, మళ్ళీ జైలుకే పరిమితమవక తప్పకపోవచ్చు.

వ్యవహారం చూస్తోంటే, 2024 ఎన్నికల్లోపు చంద్రబాబు, జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేనట్టుంది.! ఆ దిశగా, అధికార వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లే కనిపిస్తోంది.

వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు, తేలిగ్గానే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి బయటపడతారని టీడీపీ శ్రేణులు తొలుత భావించాయి. ఆయన అరెస్టు జరిగే పని కాదని అనుకున్నారు. కానీ, ఆ కేసులో బయటకు రావడానికి నెల రోజులకు పైగా సమయం పడుతుండడం టీడీపీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేస్తోంది.

ఇప్పుడేమో, వ్యవస్థల్ని చంద్రబాబు ఏనాడూ మేనేజ్ చేయలేదు.. ఇప్పుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నది వైఎస్ జగన్ మాత్రమే.. అని తెలుగు తమ్ముళ్ళు కొత్త పల్లవి అందుకుంటున్నారు.