ఏపీ స్థానిక ఎన్నికల వివాదంలో కీలక మలుపు .. ఆదేశాలు జారీచేసిన హైకోర్టు !

AP High court imposes stay on election commission issue

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య వివాదం హైకోర్టు వేదికగా తాజాగా మరో మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల్లోపు ముగ్గురు ప్రిన్సిపాల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవాలని హై కోర్టు ఆదేశించింది.

కరోనా కారణంగా ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన వివరాలను నిమ్మగడ్డకు అధికారులు వివరించాలని కోర్టు సూచించింది. అయితే అధికారులు ఎక్కడ కలవాలన్న విషయాన్ని నిమ్మగడ్డ తెలియజేస్తారని కోర్టు తెలిపింది. అయితే అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాకపోతే మళ్లీ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుండగా… కరోనా కారణంగా అప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా… ఇదే విషయాన్ని ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ ద్వారా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని.. ప్రభుత్వం సహకరించాలని స్పష్టం చేసింది.