ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడిచిందని.. తాజాగా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారన్నారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. కాగా, 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు.. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.