రాజధాని విషయంలో ఏపీ సర్కారుకి సుప్రీంకోర్టులో ఊరట.!

రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఆరు నెలల్లోగా రాజధానిలో నిర్మాణాలు పూర్తి చేయాలంటూ కొన్నాళ్ళ క్రితం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ సర్కారు పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ సందర్భంగా హైకోర్టుని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించింది. అభివృద్ధి ఎలా జరుగుతుందన్నదాన్ని నిర్ణయించడానికి హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా.? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఫలానా చోట రాజధాని వుండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అభివృద్ధి వికేంద్రీకరణను తప్పు పట్టలేమన్న సుప్రీంకోర్టు, ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది.

చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయిస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, న్యాయపరమైన వివాదాల కారణంగా మూడు రాజధానుల బిల్లుని ఏపీ సర్కారు వెనక్కి తీసుకుంది. రాజధాని వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలో వైసీపీ సర్కారు ఎలా ముందడుగు వేస్తుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.