Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భూసేకరణతో లేని భూ సమీకరణ ద్వారా సేకరించిన 33 వేల ఎకరాల్లో కోర్ కేపిటల్ నిర్మాణం కొనసాగుతుండగా, తాజాగా మరో 30 వేల ఎకరాల భూమిని అదనంగా సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అమరావతికి అఖండ రాజధాని హోదా ఇచ్చే లక్ష్యంతో ఆ నిర్మాణ ప్రణాళికలను ప్రభుత్వం మళ్లీ పునఃసమీక్షిస్తోంది. ఈ భూములు కోర్ కేపిటల్ చుట్టూ ఉండే ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ జోన్‌లు, విద్యా సంస్థలు, ఆరోగ్య పథకాల పరిధిలో అవసరమయ్యే హెల్త్ సిటీ, గ్రీన్ బెల్ట్, స్మార్ట్ విలేజ్, స్పోర్ట్స్ సిటీ, ఎయిర్‌పోర్ట్ విస్తరణ వంటి అవసరాల కోసం వినియోగించనున్నారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి విజన్‌కు మళ్లీ ఊపిరి పోస్తూ, మొత్తం 65 వేల ఎకరాల్లో ప్రణాళికను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ, గతంలో లాగే రైతులకు లాభదాయకమైన షరతులతో భూములు సమీకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నూతనంగా వచ్చే భూముల విలువ కూడా రైతులకు నష్టముండకుండే విధంగా నిర్ణయించనున్నారు.
ఇప్పటికే కోర్ కేపిటల్ ప్రాంతంలో నిర్మాణాలకు నిధుల సమీకరణ, మాస్టర్ ప్లాన్ అప్‌డేట్, గ్రీన్ సిటీ డిజైన్ వంటి అంశాలపై ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. 30 వేల ఎకరాల తాజా నిర్ణయం అమరావతిని కేవలం రాజధానిగా మాత్రమే కాకుండా భవిష్యత్తు భారత అభివృద్ధికి ప్రాతినిధ్యంగా నిలబెట్టే దిశగా తీసుకున్న భారీ అడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.