ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే వచ్చే ముప్పై ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని అంటుంటారు. అందుకే సంక్షేమ పథకాలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మూడు ప్రాంతాల్లో ఆరుగురు నేతలు జగన్ కు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. ఒక్కసారికే జగన్ ను ఇంటికి పంపించే ఛాన్స్ కూడా లేకపోలేదు. అనేక జిల్లాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు నేతల కారణంగా ఈసారి 151 సీట్లు కాదు గదా, అందులో డబుల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జగన్ కొన్ని జిల్లాలను, ప్రాంతాలను కొందరికి రాసిచ్చినట్లే కనపడుతుంది.
అక్కడ వారు చెప్పిందే వేదం. తమ పార్టీ ఎమ్మెల్యేలయినా వారికి అవసరం లేదు. పార్టీ బలోపేతం సంగతి పక్కన పెట్టి సొంత ప్రయోజనాలే చూసుకుంటుండటంతో వైసీపీలో విభేదాలు రచ్చ కెక్కుతున్నాయి. దీంతో వారి పేరు బయటకు చెప్పకపోయినా అధికారులపై వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాను తీసుకుంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పింది వేదం. ఆయన మాట శాసనం. ఇక నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ పెత్తనం చేస్తున్నారంటున్నారు. అక్కడ ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, రాయలసీమ ప్రాంతంలో సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకే విలువ లేకుండా పోతోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చెప్పిినట్లే అంతా జరుగుతుంది. ఇలా కొద్ది మంది చేతుల్లోనే అధికార యంత్రాంగం ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 30 ఏళ్ల సంగతి పక్కన పెడితే మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి రావడమే గగనం కావచ్చు.